Saturday 12th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సోనియాను ‘బలిదేవత’ అన్న రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రులుగా ఎలా ఉన్నారు?

సోనియాను ‘బలిదేవత’ అన్న రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రులుగా ఎలా ఉన్నారు?

‌- బండి సంజయ్ నిప్పులు!
– కాంగ్రెస్-బిఆర్ఎస్ కుట్రలపై ఫైర్

Bandi Sanjay counters Revanth Reddy | బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

గురువారం ఢిల్లీలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వీడియో క్లిప్పింగులను ప్రదర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు.

“సోనియా గాంధీని ‘బలిదేవత’ అని, ఆమె నీచ పనుల వల్లే తెలంగాణ యువకులు బలిదానమయ్యారని రేవంత్ రెడ్డి గతంలో అనలేదా?

అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా తుపాకీ పట్టుకుని వెళ్ళింది రేవంత్ కాదా?” అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి కేబినెట్‌లో మంత్రులుగా ఉండి బీజేపీని విమర్శించడం సిగ్గుచేటన్నారు.

తేజస్వి సూర్య వ్యాఖ్యల సమర్థన..
“తేజస్వి సూర్య తెలంగాణను అవమానించలేదు. కాంగ్రెస్ చేసిన అశాస్త్రీయ విభజన వల్ల జరిగిన నష్టాన్ని దేశ విభజన నాటి తప్పిదాలతో పోల్చారు. 2009లో తెలంగాణ ప్రకటించి యూ-టర్న్ తీసుకోవడం వల్లే 1400 మంది చనిపోయిన మాట వాస్తవం కాదా?” అని నిలదీశారు.

కాకినాడ తీర్మానం (ఒక ఓటు – రెండు రాష్ట్రాలు) నుండి పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే వరకు బీజేపీ తెలంగాణకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. “చిన్నమ్మ సుష్మా స్వరాజ్ చొరవ లేకపోతే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేదా?” అని ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేస్తే, రేవంత్ ప్రభుత్వం రెండేళ్లలోనే 3 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల చేతికి చిప్ప ఇచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్స్ చూసి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని బండి సంజయ్ కోరారు.

క్రెడిట్ కోసమే డ్రామాలు..
చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుంటే, ఆ క్రెడిట్ ప్రధాని మోదీకి మరియు బీజేపీకి వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు రాత్రి ఫోన్లలో మాట్లాడుకుని ఈ వివాదానికి తెరతీశారని ఆరోపించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions