Friday 12th June 2026
12:07:03 PM
Home > క్రీడలు > పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు..

పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు..

‌‌- ఆస్ట్రేలియా టీ20జట్టులో నిఖిల్ చౌదరీ..  

  • బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపిక..
  • 60ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా తరఫున ఆడనున్న భారత మూలాల క్రికెటర్

Nikhil Chaudhary In Australia T20 Team | బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో భారత మూలాల ఆటగాడు నిఖిల్ చౌదరీకి చోటు దక్కింది. 2024-25 బిగ్ బాష్ లీగ్‌లో ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకునే ప్రదర్శన చేసిన నిఖిల్‌కు తొలిసారి ఆస్ట్రేలియా జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది.

ఈ ఎంపికతో గత ఆరు దశాబ్దాల్లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న భారత మూలాల క్రికెటర్‌గా నిఖిల్ చౌదరీ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం 30 ఏళ్ల వయసున్న నిఖిల్ ఢిల్లీలో జన్మించారు. భారత్‌లో పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన ఆయన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లో కూడా పాల్గొన్నారు.

అయితే 2020లో బంధువులను కలిసేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన నిఖిల్ జీవితం అనూహ్య మలుపు తిరిగింది. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో స్వదేశానికి తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. అనంతరం ఆస్ట్రేలియాలోనే స్థిరపడిన ఆయన జీవనోపాధి కోసం పోస్టుమ్యాన్ ఉద్యోగంతో పాటు పలు పనులు చేశారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా క్రికెట్‌పై ఆసక్తిని వదులుకోని నిఖిల్ ప్రతిభను ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్స్ గుర్తించారు. హోప్స్ ప్రోత్సాహంతో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో అవకాశాలు అందుకున్న నిఖిల్, టాస్మేనియా జట్టుతో పాటు బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ తరఫున రాణించారు.

బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్ బౌలింగ్‌లోనూ మెప్పించిన నిఖిల్ చౌదరీ, క్రమంగా తన ప్రతిభతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. చివరకు బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో స్థానం దక్కించుకుని తన కలను సాకారం చేసుకున్నారు. పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం నుంచి అంతర్జాతీయ క్రికెట్ వేదిక వరకు నిఖిల్ చేసిన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

You may also like
australia team
టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions