Janasena Party About Deputy Cm Issue | రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చెయ్యాలని పలువురు టీడీపీ నాయకులు బహిరంగ ప్రకటనలు చేసిన విషయం తెల్సిందే.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి తో మొదలైన డిప్యూటీ సీఎం ప్రతిపాదనను అనంతరం ఇతర టీడీపీ నాయకులు సమర్ధించారు. మరోవైపు జనసేన నాయకులు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనేది తమ కోరిక అంటూ వ్యాఖ్యానాలు చేశారు.
టీడీపీ, జనసేన నాయకుల మాటలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. ఇకపై ఈ వ్యవహారంలో నాయకులెవరూ బహిరంగ వ్యాఖ్యానాలు చేయొద్దని మంగళవారం జనసేన అధిష్టానం స్పష్టం చేసింది.
మీడియా ముందు ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టులు చేయవద్దని జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ అంశంపై నాయకులెవరు మాట్లాడవద్దని, ఏ నిర్ణయమైనా కూటమి నాయకులు కూర్చుని మాట్లాడుకుంటారని తెలుగుదేశం పార్టీ సోమవారం ప్రకటన చేసిన విషయం తెల్సిందే.