- అలర్ట్ అయిన ప్రభుత్వం..
- 21 రోజుల హోమ్ ఐసోలేషన్!
Ebola Alert For TG | ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రమాదకర ‘ఎబోలా’ (Ebola) వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ఈ నెల 25వ తేదీ నాటికి మొత్తం 58 మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ప్రయాణికుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు అధికారులు సుదీర్ఘంగా వివరించారు. అయితే, హైదరాబాద్ వచ్చిన ఈ 58 మంది ప్రయాణికులలో ప్రస్తుతానికి ఎవరికీ ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీరిని ‘కేటగిరీ-I’ (Category-I) కింద వర్గీకరించి, 21 రోజుల పాటు ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ (హోమ్ ఐసోలేషన్) లో ఉంచినట్లు తెలిపారు.
పటిష్ట నిఘా – పుణే ఎన్‌ఐవీకి సాంపిల్స్..
ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో గట్టి నిఘా పెట్టింది. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న 58 మంది ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా నిఘా బృందాలు (District Surveillance Teams) నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
ఎన్‌ఐవీ పుణేకు సాంపిల్స్.. అనుమానిత లక్షణాలు ఏమైనా కనిపిస్తే, వారి సాంపిల్స్ సేకరించి తక్షణమే పరీక్షల నిమిత్తం పుణేలోని ప్రసిద్ధ ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ (NIV) కి పంపించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఆందోళన వద్దు.. ఎయిర్‌పోర్ట్ దగ్గరే పటిష్ట చర్యలు..
మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలో ఎబోలా పరిస్థితిపై సమీక్షించిన అనంతరం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని, అలాగే ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఎక్కడా గుర్తించలేదని మంత్రి స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన గానీ, భయాందోళనలు గానీ చెందాల్సిన అవసరం లేదన్నారు.
సన్నద్ధంగా ఆరోగ్య వ్యవస్థ?
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లోనే ఎబోలా రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వకుండా పటిష్టమైన స్క్రీనింగ్ చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.
ప్రజారోగ్య రక్షణ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ భరోసా ఇచ్చారు.







