- వందేమాతరం’ వివాదంపై కీలక పిటిషన్..
- తమిళనాడు హౌస్‌లో గార్డ్ ఆఫ్ ఆనర్!
TN CM Vijay meets PM Modi | తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న స్టార్ హీరో సి. జోసెఫ్ విజయ్ బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారి దేశ రాజధానికి విచ్చేసిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’ వేదికగా సమావేశంలో పాల్గొన్నారు.
సుమారు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ.. కేంద్రానికి, తమిళనాడు సరికొత్త నాయకత్వానికి మధ్య మారబోతున్న పొలిటికల్ ఈక్వేషన్లపై దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారితీసింది.
ఈ భేటీ సందర్భంగా తమిళనాడుకు సంబంధించిన పలు కీలక సమస్యలు, వివాదాలపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి విజయ్ ఒక సమగ్రమైన పిటిషన్‌ను సమర్పించారు.
వందేమాతరం వర్సెస్ తమిళనాడు రాష్ట్ర గీతం..
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గీతాన్ని మొదట పాడాలంటూ వచ్చిన సర్క్యులర్ వివాదాన్ని విజయ్ ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు.
వందేమాతరం కంటే ముందే తమిళనాడు రాష్ట్ర అధికారిక గీతాన్ని (Tamil Nadu State Anthem) ఆలపించేలా అనుమతించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించాల్సిందిగా ప్రధాని మోదీని ఆయన కోరారు.
ప్రస్తుతం తమిళనాడులో సాంస్కృతిక అస్తిత్వం మరియు ప్రోటోకాల్‌పై పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో విజయ్ ఈ డిమాండ్ చేయడం గమనార్హం.
మేకేదాటు ప్రాజెక్ట్‌పై అభ్యంతరం..
కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకేదాటు (Mekedatu Project) డ్యామ్ నిర్మాణం, దానికి సంబంధించిన భూమి పూజలపై విజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని స్పష్టం చేశారు.
ఈ వివాదంలో భాగస్వామ్య రాష్ట్రాల అనుమతి లేకుండా కర్ణాటకకు ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వవద్దని జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ రీసోర్సెస్ ట్రిబ్యునల్‌ను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
డిఫెన్స్ ప్రాజెక్టులు & మత్స్యకారుల అరెస్టులు??
డీఆర్‌డీఓ (DRDO) ఆధ్వర్యంలో జరుగుతున్న AMCA, CABS ప్రాజెక్టుల పరిశోధనలను ప్రస్తావిస్తూ.. ప్రతిష్టాత్మక CABS ఫెసిలిటీని తమిళనాడులో ఏర్పాటు చేయాలని కోరారు.
శ్రీలంక నావికాదళం చేతిలో తమిళనాడు మత్స్యకారులు అరెస్ట్ అవుతున్న ఉదంతాలపై విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం లంక జైళ్లలో మగ్గుతున్న 58 మంది మత్స్యకారులను, సీజ్ చేసిన 288 పడవలను విడిపించేలా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు ఢిల్లీ చేరుకున్న సీఎం విజయ్‌కు తమిళనాడు హౌస్‌లో అధికారికంగా గౌరవ వందనం (Guard of Honour) సమర్పించారు. ఈ పర్యటనలో ఆయన కేవలం ప్రధాని మోదీనే కాకుండా.. అటు ఎన్డీయే, ఇటు ఇండీ (I.N.D.I.A) కూటమి నేతలతో వరుస భేటీలు కానున్నారు.
కేంద్ర మంత్రులతో భేటీ..
హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వైస్ ప్రెసిడెంట్ సి.పి. రాధాకృష్ణన్‌లను విజయ్ కలవనున్నారు.
మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో కూడా విజయ్ సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే 10 జన్ పథ్ వెలుపల రాహుల్ గాంధీ-విజయ్ ల భారీ పోస్టర్లు వెలిశాయి. లెఫ్ట్ పార్టీల నేతలు కూడా విజయ్ ని కలవనున్నారు.







