- ఫేక్ ఫోన్‌పే యాప్‌లతో కేటుగాళ్ల టోకరా..
- హైదరాబాద్ వ్యాపారులకు సీపీ సజ్జనర్ కీలక సూచనలు!
Hyd CP VC Sajjanar Alerts Bakrid Traders | బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని గొర్రెలు, మేకల విక్రయదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (CP) వీసీ సజ్జనర్ హెచ్చరించారు.
పండుగ సీజన్ కావడంతో నగరంలోని జీవాల సంతలు కొనుగోలుదారులు, వ్యాపారుల రద్దీతో ఎంతో సందడిగా మారాయి.
అయితే, ఇదే అదనుగా భావిస్తున్న కొందరు సైబర్ కేటుగాళ్లు.. అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ చెల్లింపుల (Digital Payments) పేరిట భారీ మోసాలకు తెగబడుతున్నారని సీపీ వెల్లడించారు.
ముఖ్యంగా ‘ఫేక్ ఫోన్ పే’ (Fake PhonePe) వంటి నకిలీ మొబైల్ అప్లికేషన్లను వాడుతూ వ్యాపారుల కళ్లకు కప్పేస్తున్నారని, సంతల్లో ఉండే విపరీతమైన హడావుడిని ఆసరాగా చేసుకుని ఈ దంద సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అసలు మోసం ఎలా జరుగుతుందంటే?
కేటుగాళ్లు మార్కెట్‌లోకి వచ్చి జీవాలను కొనుగోలు చేసిన తర్వాత.. తమ మొబైల్‌లోని నకిలీ యాప్ ద్వారా నగదు సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫర్ అయినట్లు స్క్రీన్‌పై చూపిస్తారు. అందులో సౌండ్ అలర్ట్ కూడా వచ్చేలా సెటప్ చేసుకుంటున్నారు.
సంతల్లో ఉండే రద్దీ వల్ల వ్యాపారులు తమ బ్యాంక్ ఖాతాల్లోకి నిజంగానే డబ్బులు జమ అయ్యాయో లేదో వెంటనే చెక్ చేసుకోకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కేటుగాళ్లు జీవాలతో పరారవుతున్నారు.
కంచన్‌బాగ్, రాజేంద్రనగర్‌లో రెండు భారీ మోసాలు!
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజాగా జరిగిన రెండు నకిలీ డిజిటల్ పేమెంట్స్ మోసాల వివరాలను సీపీ సజ్జనర్ మీడియాకు వివరించారు. కంచన్‌బాగ్ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు మూడు బైక్‌లపై వచ్చి ఒక మేకల వ్యాపారితో బేరం కుదుర్చుకున్నారు.
అనంతరం రూ. 68,000 చెల్లించినట్లు నకిలీ యాప్ ద్వారా సక్సెస్ స్క్రీన్ చూపించి జీవాలను లోడ్ చేసుకుని వెళ్లిపోయారు.
రాజేంద్రనగర్‌లో ₹48 వేల టోకరా..
ఇదే తరహాలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు కేటుగాళ్లు ఒక గొర్రెల వ్యాపారి వద్ద రూ. 48,000 విలువైన జీవాలను కొనుగోలు చేసి, నకిలీ పేమెంట్ యాప్‌తో మోసగించారు.
బాధితులు హడావుడి తగ్గాక ఆలస్యంగా తమ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసుకోగా, పైసలు జమ కాలేదని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
పోలీస్ కమిషనర్ కీలక సూచనలు..
జీవాల విక్రయదారులు కేవలం మొబైల్ స్క్రీన్‌పై కనిపించే పేమెంట్ సక్సెస్ మెసేజ్‌లను చూసి నమ్మవద్దు. మీ సొంత బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని లేదా మీ మొబైల్‌కి అఫీషియల్ బ్యాంక్ ఎస్ఎమ్ఎస్ (SMS) వస్తేనే జీవాలను అప్పగించాలి.
అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కి సమాచారం అందించాలి.







