Tuesday 26th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తమిళనాడులో సీఎం విజయ్‌కు మొదటి ‘అగ్నిపరీక్ష’!

తమిళనాడులో సీఎం విజయ్‌కు మొదటి ‘అగ్నిపరీక్ష’!

vijay swearing in ceremony
  • 15 రోజుల్లోనే శాంతిభద్రతల సంక్షోభం..
  • విపక్షాల ముకుమ్మడి దాడి..
  • ‘పోక్సో’ తీర్పుతో టీవీకే డిఫెన్స్! 

Tamil Nadu CM Vijay Law & Order Crisis | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఇళయదళపతి సి. జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) నేతృత్వంలోని టీవీకే (TVK) కూటమి ప్రభుత్వానికి పదిహేను రోజుల్లోనే మొదటి అతిపెద్ద రాజకీయ, పరిపాలనా పరమైన సవాల్ ఎదురైంది.

ఎన్నికల ప్రచారంలో మహిళలు, చిన్నారుల రక్షణే మా ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటించిన విజయ్.. అధికారం చేపట్టిన రెండు వారాల్లోనే రాష్ట్రంలో జరిగిన రెండు ఘోరమైన మైనర్ నేరాలు ప్రభుత్వ ప్రతిష్టను ఒక్కసారిగా దెబ్బతీశాయి.

మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడు ఏ. గుబేంద్రన్ దారుణ హత్యకు గురికావడం, కోయంబత్తూరు సూలూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య జరగడం తమిళనాడువ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఈ క్రమంలో బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ముకుమ్మడిగా సీఎం విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగాయి.

మంత్రి, పోలీసుల ‘చిరునవ్వు’ వివాదం

ప్రభుత్వం మరింత డిఫెన్స్‌లో పడటానికి ప్రధాన కారణం ఒక మంత్రి మరియు ఉన్నతాధికారి ప్రవర్తన.  కోయంబత్తూరు బాలిక ఉదంతంపై మీడియా ప్రశ్నించగా.. టీవీకే పారిశ్రామిక శాఖ మంత్రి కీర్తన నవ్వుతూ సమాధానం దాటవేశారు.

తాను కేవలం ‘పరిపాలనా పరమైన ప్రశ్నలకు’ మాత్రమే సమాధానం ఇస్తానని అనడం, నవ్వడం తీవ్ర దుమారం రేపింది. అదేవిధంగా కేసు వివరాలు వెల్లడించే ప్రెస్ మీట్ కు ముందు సీనియర్ పోలీస్ అధికారిణి ఆర్. వి. రమ్య భారతి నవ్వుతూ సంజ్ఞలు చేయడం వీడియోల్లో రికార్డయి వైరల్ కావడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. హోంశాఖ నేరుగా సీఎం విజయ్ చేతిలోనే ఉండటంతో విపక్షాలు దీనిపై గట్టిగా నిలదీశాయి.

విపక్షాల ముకుమ్మడి వ్యూహం ..  
తమిళనాడు అంతటా శాంతిభద్రతలు క్షీణించాయంటూ విపక్ష నేతలు సోషల్ మీడియా వేదికగా సీఎం విజయ్‌పై విరుచుకుపడ్డారు. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ.. ఇది తమిళనాడునా లేక ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నా? ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన విజయ్ గారు ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు?” అంటూ శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఎక్స్ (X) లో సూటిగా ప్రశ్నించారు.

విల్లుపురంలో బాలికపై లైంగిక దాడి, కోయంబత్తూరులో పెట్రోల్ బాంబు దాడులను ఆయన ప్రస్తావించారు. అన్నామలై (BJP) విమర్శలు..

 “డ్రగ్స్ పెడ్లర్లు, హంతకులకు తమిళనాడులో ఫ్రీ పాస్ దొరికింది. కొత్త టీవీకే ప్రభుత్వం ఇంకా తన గెలుపు సంబరాల మూడ్ లోంచి బయటకు రాలేదు” అని బీజేపీ సీనియర్ నేత కె. అన్నామలై మండిపడ్డారు.

ఈపీఎస్ (AIADMK) ఘాటు వ్యాఖ్యలు..
మహిళల భద్రతను నాశనం చేయడంలో విజయ్ ప్రభుత్వం మునుపటి డీఎంకే ప్రభుత్వానికి కార్బన్ కాపీలా మారిందని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) విమర్శించారు.

“నేను మీ మామను అంటూ ఎన్నికల్లో సెంటిమెంట్ డైలాగులు చెప్పి పిల్లల తల్లిదండ్రుల ఓట్లు వేయించుకున్న జోసెఫ్ విజయ్.. ఇప్పుడు అదే పిల్లలను మృగాలు నలిపేస్తుంటే మూగప్రేక్షకుడిగా చూస్తూ ఆనందిస్తున్నారు” అని బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

‘డబుల్ డెత్ పెనాల్టీ’ కేసుతో సీఎం విజయ్ డ్యామేజ్ కంట్రోల్..

విపక్షాల బ్యారేజ్ అటాక్స్ మరియు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గమనించిన సీఎం విజయ్.. తక్షణ డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగారు.

తూత్తుకుడి జిల్లా విలాతికుళంలో గత మార్చిలో జరిగిన ఒక ప్లస్ టూ విద్యార్థిని రేప్ అండ్ మర్డర్ కేసులో.. తూత్తుకుడి పోక్సో కోర్టు (Thoothukudi POCSO Court) నిందితుడు ధర్మ మునీశ్వరన్‌కు ‘డబుల్ ఉరిశిక్ష’ (Double Death Penalty) విధిస్తూ మంగళవారం సంచలన తీర్పునిచ్చింది.

ఈ తీర్పును అస్త్రంగా చేసుకుని సీఎం విజయ్ ఎక్స్ (X) లో సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. కేవలం మూడు నెలల రికార్డు కాలంలోనే, 71 మంది సాక్షులను విచారించి బాధితురాలికి అత్యంత వేగంగా న్యాయం చేకూర్చామని.. నేరస్థులకు తమ ప్రభుత్వంలో ఎలాంటి మినహాయింపులు ఉండవనడానికి ఈ ఫాస్ట్ ట్రాక్ తీర్పే నిదర్శనమని విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా చిన్నారుల రక్షణ కోసం ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions