- ఒక్కసారిగా 200 పోస్టులు డిలీట్..
- ‘తిలక్ వర్మ కామెంట్ – చాహల్ వేపింగ్’ వివాదాల తర్వాత ఊహించని నిర్ణయం!
Arshdeep Singh deletes Instagram posts | టీమిండియా స్టార్ పేసర్, పంజాబ్ కింగ్స్ (PBKS) స్పియర్ హెడ్ అర్షదీప్ సింగ్ ఐపీఎల్ సీజన్ మధ్యలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మైదానంలో వికెట్లు తీస్తూనే.. మైదానం బయట తోటి ఆటగాళ్లతో కలిసి క్రేజీ వ్లాగ్స్, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న అర్షదీప్.. అనూహ్యంగా తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతా నుండి ఏకంగా 200కు పైగా పోస్టులను తొలగించారు.
కేవలం కమర్షియల్ బ్రాండ్ ప్రమోషన్లకు సంబంధించిన పోస్టులు మినహా.. గతంలో తను తోటి క్రికెటర్లతో కలిసి చేసిన సరదా రీల్స్, ఫోటోలన్నింటినీ అర్షదీప్ డిలీట్ చేయడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇందులో టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీతో కలిసి గతంలో చేసిన ఒక పాపులర్ రీల్ కూడా మాయమవడం గమనార్హం.
వరుస కాంట్రవర్సీలే కారణమా?
ఈ ఐపీఎల్ సీజన్ సమయంలో అర్షదీప్ చేసిన కొన్ని సోషల్ మీడియా వ్లాగ్స్ ఊహించని విధంగా పెద్ద వివాదాలకు కారణమయ్యాయి.
ముంబయి ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మను ఉద్దేశించి అర్షదీప్ ఒక వీడియోలో ‘ఓయ్.. అంధేరా’ (Oye Andhera) అని పిలవడం తీవ్ర వర్ణవివక్ష (Racism) వివాదానికి దారితీసింది. నెటిజన్లు అర్షదీప్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అర్షదీప్ తీసిన మరో సరదా వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో.. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ-సిగరెట్ (Vaping) కాలుస్తూ కెమెరాకు చిక్కడం మరో పెద్ద కాంట్రావర్సీకి కారణమైంది. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలాంటి పనులు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
రంగంలోకి దిగిన బీసీసీఐ (BCCI) – వ్లాగింగ్‌పై నిషేధం..
ఈ వరుస సోషల్ మీడియా వివాదాలు ఐపీఎల్ మరియు క్రికెటర్ల ఇమేజ్‌ను దెబ్బతీసేలా మారడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీరియస్ అయింది.
ఐపీఎల్ ముగిసే వరకు ఆటగాళ్లు ఎవరూ కూడా హోటల్ రూమ్స్ లో, ప్రైవేట్ ప్రదేశాల్లో వ్లాగ్స్ చేయకూడదని, వాటిని సోషల్ మీడియాలో పెట్టకూడదని బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది.
ఇటు పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ సైతం అర్షదీప్ చర్యలపై క్లాస్ తీసుకుని, తగిన క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.
ఈ తరుణంలో ఇకపై కేవలం క్రికెట్ పైనే పూర్తి ఫోకస్ పెట్టాలని నిశ్చయించుకున్న అర్షదీప్.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ముందస్తు జాగ్రత్తగా తన పాత పోస్టులన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించినట్లు స్పష్టమవుతోంది.







