- అధికారులకు కీలక ఆదేశాలు!
Pollution free Godavari theme Pushkaralu | వచ్చే ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గోదావరి పుష్కరాలను పర్యావరణ హితంగా, సరికొత్త విజన్‌తో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
గోదావరి నదిని సంరక్షించడమే ధ్యేయంగా.. ఈసారి పుష్కరాలను ‘కాలుష్యరహిత గోదావరి’ అనే ప్రత్యేక థీమ్‌తో సాకారం చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
రాజమండ్రి పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 6 గంటలకే పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలనకు దిగారు.
రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు ఆయన పడవలో ప్రయాణించి, గోదావరి నదిలోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్న ప్రధాన ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.
సమగ్ర ఆడిట్‌కు ఆదేశం..
గోదావరి జలాల కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఉన్నతాధికారుల సమీక్షలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
గోదావరి నదిలోకి కలుస్తున్న కాలుష్యకారక వ్యర్థాలు, మురుగు జలాలు, వాటి నిర్వహణపై తక్షణమే పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
యాక్షన్ ప్లాన్ నివేదిక..
కాలుష్య నివారణకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి? భవిష్యత్తులో చేపట్టబోయే పనులపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలన్నారు.
“మనం నిజాయతీగా కాలుష్య నివారణ పనులు చేయాలి. సమస్య ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలుసుకుంటేనే, దానికి ఆచరణాత్మక పరిష్కారాలు చూపడం సులభం అవుతుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలపై ఫోకస్..
రాజమండ్రిలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన ‘ఆంధ్ర పేపర్ మిల్స్’ (Andhra Paper Mills) నుంచి వస్తున్న వ్యర్థ జలాల నిర్వహణపై డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పేపర్ మిల్స్ నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవకుండా నిరోధించడానికి వేగంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
నదిలోకి చేరే మురుగు, పారిశ్రామిక జలాల శుద్ధీకరణ పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో (Sewage and Industrial Water Treatment) జరగాలని, పర్యావరణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.







