YS Jagan Sensational Comments On Chandra Babu | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర స్థాయి ఆరోపణలు, ప్రత్యారోపణలు ముదిరిపాకాన పడ్డాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని (YCP) లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ‘గొడ్డలి పార్టీ’, ‘గన్ కల్చర్’ ఆరోపణలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మరియు ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్యకు సంబంధించి జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
తాము హింసను ప్రోత్సహించే వాళ్లం కాదని, తామే హింసకు బాధితులమంటూ జగన్ తమ కుటుంబంలో జరిగిన దారుణాలను గుర్తుచేశారు.
వైసీపీపై వస్తున్న ఫ్యాక్షనిజం ఆరోపణలను తిప్పికొడుతూ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “రాజారెడ్డి, వైఎస్సార్, వివేకానంద రెడ్డి రూపంలో ముగ్గురు పెద్దలను కోల్పోయిన నష్టపోయిన కుటుంబం మాది. అలాంటి మాపై గన్ కల్చర్, గొడ్డలి పోటు అంటూ అపవాదులు వేస్తున్నారు” అని జగన్ మండిపడ్డారు.
టీడీపీ ఆఫీసులో ఆశ్రయం..
గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన తాత వైఎస్ రాజారెడ్డి హత్య జరిగిందని జగన్ ఆరోపించారు. ఆ దారుణానికి ఒడిగట్టిన నిందితులు నేరుగా వెళ్లి టీడీపీ కార్యాలయంలోనే ఆశ్రయం పొందారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదం..
ఈ ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్.. 2009లో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై ఇప్పటివరకు ఉన్న సందేహాలను మళ్లీ తెరపైకి తెస్తూ చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు.
వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి గురవడానికి కేవలం రెండు మూడు రోజుల ముందు.. నాటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తాను?’ అంటూ వైఎస్సార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారని జగన్ గుర్తుచేశారు.
అలా చంద్రబాబు వ్యాఖ్యానించిన రెండు రోజుల్లోనే వైయస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పావురాల గుట్ట వద్ద ప్రమాదానికి గురై ఆయన మరణించారని జగన్ పేర్కొన్నారు.
ఆనాటి హెలికాప్టర్ ప్రమాదంపై ఇప్పటికీ జనాల్లో ఎన్నో సందేహాలు అలాగే ఉండిపోయాయని చెప్తూ.. చంద్రబాబుది పక్కా ‘క్రిమినల్ బ్రెయిన్’ అంటూ జగన్ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.







