– మహిళా ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర మంత్రి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
Union Minister Kishan Reddy | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి (Union Minister G. Kishan Reddy) మహిళా ఉద్యోగులు, కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలనీస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, కార్మికులకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌లో భాగంగా మహిళల అభివృద్ధి నుంచి అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
బొగ్గు, గనుల రంగంలో టెక్నికల్, ఆపరేషనల్ కార్యకలాపాల్లో మహిళలకు అవసరమైన నైపుణ్యాలు కల్పిస్తూ శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. వికసిత భారత్ నిర్మాణంలో మహిళల పాత్రను మరింత బలపరిచే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో బొగ్గు, గనుల రంగంలోని కీలక విభాగాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. విధానపరమైన నిర్ణయాలు, సాంకేతిక రంగం, నిర్వహణ, భద్రతా పర్యవేక్షణ వంటి అనేక విభాగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్నారని అన్నారు.
పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, సరైన మౌలిక సదుపాయాలు అందించడం, సమాన అవకాశాలు కల్పించడం, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకునేలా ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మరోసారి మహిళా కార్మిక లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి మహిళ తన హక్కులను కాపాడుకుంటూ సమానత్వం దిశగా ముందుకు సాగాలని కోరారు. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా మహిళలు తమ ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.








