Wednesday 22nd April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దేశానికే అవమానం.. ఖర్గే వ్యాఖ్యలపై ‘ఈసీ’కి బీజేపీ ఫిర్యాదు!

దేశానికే అవమానం.. ఖర్గే వ్యాఖ్యలపై ‘ఈసీ’కి బీజేపీ ఫిర్యాదు!

bjp complaint on kharge

BJP complaint to EC On Kharge | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ‘ఉగ్రవాది’ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

ఈ వ్యవహారంపై బీజేపీ ఉన్నత స్థాయి బృందం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు, అర్జున్ రామ్ మేఘవాల్ నేతృత్వంలోని బృందం ఎన్నికల కమిషనర్లను కలిసింది.

ఖర్గే వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (MCC) తీవ్రంగా ఉల్లంఘించాయని వారు పేర్కొన్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని సంబోధించడం కేవలం వ్యక్తిగత విమర్శే కాదు, యావత్ దేశాన్ని అవమానించడమేనని కిరణ్ రిజుజు వ్యాఖ్యానించారు.

ఖర్గే తన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయనపై కఠినమైన ప్రచార ఆంక్షలు విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

కాగా, ఈ విమర్శలపై ఖర్గే స్పందిస్తూ.. తాను ప్రధానిని వ్యక్తిగతంగా ఉగ్రవాది అనలేదని, ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో ఆయన విపక్షాలను ‘టెర్రరైజ్’ (భయభ్రాంతులకు గురిచేయడం) చేస్తున్నారనే అర్థంలో అన్నానని వివరణ ఇచ్చారు.

తమిళనాడులో రేపు (ఏప్రిల్ 23) జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు ముందు ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో, ఓటర్ల తీర్పుపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions