- పేలిన లిక్విడ్ ల్యాడిల్..
- 1500 డిగ్రీల వేడితో ఉక్కుద్రవం లీక్!
- ఎనిమిది మంది కార్మికులు సజీవ దహనం
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత!
Vizag Steel Plant Major Blast | విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని ఎస్ఎమ్ఎస్-2 (SMS-2), ఎస్టీసీ-3 (STC-3) హీట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ఒక్కసారిగా పేలిపోయింది.
ఈ పేలుడు ధాటికి భారీగా ఉక్కుద్రవం లీక్ కావడంతో ప్లాంట్ ఆవరణలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ భయంకర దుర్ఘటనలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
1,500 డిగ్రీల వేడితో విరజిమ్మిన ఉక్కుద్రవం..
సుమారు 1,500 డిగ్రీల విపరీతమైన వేడితో ఉన్న స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ద్వారా ఉక్కుద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ల్యాడిల్ పేలడంతో ఒక్కసారిగా ఉక్కుద్రవం చుట్టుపక్కల విస్తరించింది.
ఈ ఊహించని పరిణామంతో ప్లాంట్‌లో ఉన్న కార్మికులు, ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి..
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఈ భారీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆయన ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సమన్వయంతో సహాయక చర్యలు..
పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం, ప్రమాద స్థలంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన కార్మికులకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.







