Kavitha Party Name Revealed | తెలంగాణ రాజకీయాల్లో మరో పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ ‘ఆవిర్భావ సభ’లో ఆమె పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) గా వెల్లడించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.
కవిత ఆవిష్కరించిన జెండాలో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా పసుపు రంగును ఎంచుకున్నారు. జెండా మధ్యలో నీలి రంగులో తెలంగాణ చిత్రపటం, దానిపై తెలుపు రంగులో ‘టీఆర్ఎస్’ అనే అక్షరాలు మెరిసిపోతున్నాయి.
తన తండ్రి కెసిఆర్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత వదిలేసిన ‘TRS’ సెంటిమెంట్‌ను కవిత తన పార్టీకి ఎంచుకోవడం విశేషం. సభలో ప్రసంగిస్తూ కవిత గారు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించే వ్యాఖ్యలు చేశారు.
“తెలంగాణలో కొత్త విప్లవం మొదలైంది. ప్రజల గొంతుకగా ఈ పార్టీ పనిచేస్తుంది. నేను కచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిని అవుతాను.
ఇది నా ధీమా కాదు, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం” అని ఆమె ప్రకటించారు. యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తామని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి, తన తండ్రి సిద్ధాంతాలకు భిన్నంగా సొంత పార్టీ పెట్టడం ద్వారా కవిత గారు తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయంపై కన్నేశారు.
ముఖ్యంగా మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల నుండి ఈ ప్రస్థానాన్ని ప్రారంభించడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలపై ఆమె పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.






