Thursday 11th June 2026
12:07:03 PM
Home > తాజా > ప్లాస్టిక్‌ వాడితే రూ. 5,000 జరిమానా.. ‘ఆలూరు’ పంచాయతీ సంచలన తీర్మానం!

ప్లాస్టిక్‌ వాడితే రూ. 5,000 జరిమానా.. ‘ఆలూరు’ పంచాయతీ సంచలన తీర్మానం!

  • ఇకపై మోదుగ విస్తారాకులే కాలక్షేపం!

Aloor Plastic Ban Resolution | మారుతున్న కాలంలో ప్లాస్టిక్ మహమ్మారి పర్యావరణాన్ని ఎంతలా పాడుచేస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే, ఈ ప్లాస్టిక్ భూతానికి ప్రత్యామ్నాయంగా మన పాత తరం సంప్రదాయమైన ‘మోదుగ విస్తారాకులను’ తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చి, యావత్ రాష్ట్రానికే ఒక గ్రామం సరికొత్త స్ఫూర్తిగా నిలిచింది.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఆలూరు గ్రామ పంచాయతీ తీసుకున్న ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి, అందరి ప్రశంసలు అందుకుంటోంది.

జూలై 15 నుండి ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్..
గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని శాశ్వతంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఆలూరు గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాబోయే జూలై 15 నుండి గ్రామంలో ప్లాస్టిక్‌ను వంద శాతం నిషేధిస్తున్నట్లు గ్రామ పెద్దలు, సర్పంచ్ ప్రకటించారు.

ఈ గడువు ముగిసిన తర్వాత ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ కవర్లు లేదా పేపర్/ప్లాస్టిక్ ప్లేట్లను విక్రయించినా, విందు భోజనాల్లో వాడినా రూ. 5,000 భారీ జరిమానా విధిస్తామని పంచాయతీ పాలకవర్గం తీవ్రంగా హెచ్చరించింది.

ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక అవగాహన..
కేవలం నిషేధించడమే కాకుండా.. మార్కెట్‌లో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్థానికంగా లభించే మోదుగ ఆకులతో విస్తరాకులు కుట్టడంపై గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్లాస్టిక్ స్థానంలో మోదుగ విస్తారాకులు వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు, మహిళలకు విస్తరాకుల తయారీ ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.

ప్రకృతి ఇచ్చిన మోదుగ ఆకులను సంపదగా మార్చుకుంటూ, ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఎదిగేందుకు ఆలూరు వేసిన ఈ అడుగు.. మరిన్ని గ్రామాలకు రోల్ మోడల్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions