- అమెరికాలో ముగ్గురి ప్రాణాలు కాపాడి తెలంగాణ యువకుడి జలసమాధి..
- బాధిత కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ!
CM Revanth Tributes To Koduru Anuroop Reddy | అమెరికాలో ముగ్గురు స్నేహితుల ప్రాణాలను రక్షించే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ యువకుడు కోడూరు అనురూప్ రెడ్డి (23) సాహసానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం నివాళులు అర్పించారు.
అనురూప్ మరణం అత్యంత విషాదకరమని, తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రజల తరఫున అనురూప్ తల్లిదండ్రులకు, ఆయన సోదరుడు ఆశ్రిత్ రెడ్డికి, కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన సానుభూతిని తెలియజేశారు.
హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతానికి చెందిన కోడూరు అనురూప్ రెడ్డి.. ఇటీవలే అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్’ (UNT) లో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
మే 29వ తేదీన అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న ‘టోరో బాయో పార్క్’ (Toro Bayou Park) వద్ద అనురూప్ తన స్నేహితులతో కలిసి వెళ్ళారు.
ఆ సమయంలో ప్రమాదవశాత్తూ అతని ముగ్గురు స్నేహితులు నీటిలో మునిగిపోతూ మృత్యువుతో పోరాడుతున్నారు. స్నేహితులు మునిగిపోతుండటం చూసిన అనురూప్.. తన ప్రాణాల గురించి అస్సలు ఆలోచించకుండా తక్షణమే నీటిలోకి దూకాడు.
అత్యంత సాహసంతో ఆ ముగ్గురు స్నేహితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి కాపాడాడు. అయితే, దురదృష్టవశాత్తూ నీటి ఉధృతి ఎక్కువ కావడంతో విధి ఆయన్ను క్రూరంగా తనతో పాటు తీసుకెళ్లిపోయింది.
సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘోర దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబానికి ఒక లేఖను పంపారు. ఈ కష్టసమయంలో ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
“కేవలం 23 ఏళ్ల వయసులోనే, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న అనురూప్.. స్నేహితుల కోసం చూపిన అసాధారణ ధైర్యం, నిస్వార్థ గుణం అందరికీ స్ఫూర్తిదాయకం. ముగ్గురి ప్రాణాలు కాపాడిన అనురూప్ సర్వోన్నత త్యాగం.. మానవత్వానికి, కరుణకు నిదర్శనం.
తను పుట్టిన తెలంగాణ గడ్డకు ఆయన ఎనలేని గౌరవాన్ని, చెరగని కీర్తిని తెచ్చిపెట్టాడు” అని సీఎం రేవంత్ రెడ్డి లేఖలో కొనియాడారు. అనురూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.
మృతదేహానికి ఎంపీ, ఎమ్మెల్యేల నివాళి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు (MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్ శివార్లలోని విద్యార్థి నివాసానికి చేరుకున్నారు. అనురూప్ రెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.










