Monday 29th June 2026
12:07:03 PM
Home > తాజా > “సీఎం రేవంత్ సభ కోసం 180 ఎకరాల పంట ధ్వంసం?”

“సీఎం రేవంత్ సభ కోసం 180 ఎకరాల పంట ధ్వంసం?”

cm revanth reddy
  • సోషల్ మీడియా పోస్టులపై ఖమ్మం కలెక్టర్ క్లారిటీ!

CM Revanth Reddy Madhira Sabha Crop Damage | తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మధిర బహిరంగ సభా ఏర్పాట్ల కోసం ఏకంగా 180 ఎకరాల్లో సాగు చేసిన పంటను మున్సిపల్, జిల్లా యంత్రాంగం ధ్వంసం చేసిందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర తక్షణమే స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేస్తూ, సభా ఏర్పాట్లపై అధికారిక వివరణ ఇచ్చారు.

పంట నష్టం జరగలేదు.. రైతుల అంగీకారంతోనే సేకరణ..

వైరల్ అవుతున్న కథనాలను ఖండిస్తూ కలెక్టర్ దివాకర సభకు సంబంధించిన భూసేకరణ వివరాలను వెల్లడించారు. మధిరలో ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణ కోసం మొత్తం 30 ఎకరాలను, సభకు వచ్చే వాహనాల పార్కింగ్ సదుపాయం కోసం మరో 130 ఎకరాలను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ భూములను బలవంతంగా లాక్కోలేదని, స్థానిక రైతులందరి పూర్తి అంగీకారం తీసుకున్న తర్వాతే సభా ఏర్పాట్లకు సేకరించినట్లు ఆయన వివరించారు.

సాగు పనులు మొదలుకాలేదు..

ప్రస్తుత ఖరీఫ్ (వానకాలం) సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని, సభ కోసం గుర్తించిన సదరు భూముల్లో రైతులు ఇంకా ఎలాంటి సాగు పనులు లేదా విత్తనాలు చల్లే పనులు మొదలుపెట్టలేదని స్పష్టం చేశారు. అందువల్ల అక్కడ ఎలాంటి పంట నష్టం జరగలేదని కలెక్టర్ తేల్చిచెప్పారు.  

చెట్లను నరకలేదు.. కేవలం కొమ్మల కత్తిరింపు మాత్రమే..

సభా ఏర్పాట్ల కోసం అక్కడ ఉన్న చెట్లను యథేచ్ఛగా నరికేశారంటూ వస్తున్న ఆరోపణలపై కూడా కలెక్టర్ గట్టి క్లారిటీ ఇచ్చారు. బహిరంగ సభకు వచ్చే దారిలో ఎక్కడా పెద్ద చెట్లను నరకలేదని ఆయన చెప్పారు.

కేవలం సభా ప్రాంగణానికి వెళ్లే మార్గంలో విద్యుత్ లైన్లకు (Electricity lines) ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైన చోట్ల మాత్రమే కొన్ని చెట్ల కొమ్మలను కత్తిరించినట్లు (Pruned) కలెక్టర్ దివాకర వెల్లడించారు.

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారి సభల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన కోరారు.

సీఎం సభ రద్దు..

 అయితే మధిరలో  మంగళవారం జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దైంది. వర్షాల కారణంగా సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో మధిరలో జరగాల్సిన సీఎం రేవంత్‌ రెడ్డి సభలో మార్పులు చేశారు.

రేపు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతుభరోసా పంపిణీ సదస్సు నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి.. రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు.

You may also like
అభిమాని కోసం హనుమకొండకు పవన్ కళ్యాణ్!
అనురూప్ రెడ్డి త్యాగానికి సీఎం రేవంత్ రెడ్డి సాల్యూట్!
ఆర్టీసీ ఉద్యోగాల పేరుతో మోసపోకండి.. టీజీఎస్‌ఆర్‌టీసీ!
Rain Alert
తెలంగాణకు భారీ వర్ష సూచన..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions