Tuesday 19th May 2026
12:07:03 PM
Home > క్రైమ్ > ఏటీఎం కేంద్రాలే టార్గెట్.. ‘ఫేక్ ఫోన్ పే’ యాప్‌తో నిలువు దోపిడీ!

ఏటీఎం కేంద్రాలే టార్గెట్.. ‘ఫేక్ ఫోన్ పే’ యాప్‌తో నిలువు దోపిడీ!

‌- చాంద్రాయణగుట్ట పోలీసుల వలలో కిలాడీ దొంగ

ఏటీఎంల వద్ద అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని, నకిలీ ఫోన్ పే (PhonePe) స్క్రీన్‌షాట్‌లతో మోసాలకు పాల్పడుతున్న ఒక ప్రైవేట్ ఉద్యోగిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే..
తలాబ్ కట్టకు చెందిన అబ్దుల్లా ఒబైద్ అల్ కతేరి (25) అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోసాలకు తెరలేపాడు. ఈ నెల 6వ తేదీన అబ్దుల్ నాసర్ అనే వ్యక్తి చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేస్తుండగా నిందితుడు అతడిని కలిశాడు.

తనకు అత్యవసరంగా నగదు కావాలని, తన వద్ద ఉన్న డబ్బును బాధితుడి అకౌంట్‌కు ఫోన్ పే ద్వారా పంపిస్తానని నమ్మబలికాడు. తన ఫోన్‌లోని నకిలీ యాప్ ద్వారా డబ్బులు పంపినట్లు తప్పుడు స్క్రీన్‌షాట్ చూపించి, బాధితుడి నుంచి రూ. 10,000 నగదు తీసుకుని పరారయ్యాడు.

దర్యాప్తులో తేలిన మరిన్ని మోసాలు..
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు చాంద్రాయణగుట్ట మరియు కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటివే మరో మూడు నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. మొత్తం నాలుగు ఘటనల్లో కలిపి నిందితుడు రూ. 46,000 మేర ప్రజలను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల హెచ్చరిక..
రాజేంద్రనగర్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ పర్యవేక్షణలో నిందితుడిని అతి తక్కువ సమయంలో పట్టుకున్న బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. “ఏటీఎంల వద్ద అపరిచిత వ్యక్తులు చేసే ఆన్‌లైన్ బదిలీ ఆఫర్లను నమ్మవద్దు. మీ అకౌంట్‌లోకి డబ్బులు క్రెడిట్ అయినట్లు బ్యాంక్ నుంచి అధికారిక ఎస్ఎంఎస్ (SMS) వస్తేనే నమ్మాలి తప్ప, అవతలి వ్యక్తి చూపించే స్క్రీన్‌షాట్‌లను చూసి మోసపోవద్దు” అని పోలీసులు ప్రజలకు సూచించారు.

You may also like
vc sajjanar
ఆపరేషన్ సేఫ్ స్కూల్: రూ. 1.10 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తుల సీజ్!
తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. అడ్డుకున్న సాహసవంతులు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions