Saturday 18th April 2026
12:07:03 PM
Home > క్రైమ్ > తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. అడ్డుకున్న సాహసవంతులు!

తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. అడ్డుకున్న సాహసవంతులు!

Citizens rescue 9 year old girl Jubilee Hills | తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితుడిని సాహసోపేతంగా అడ్డుకుని, పోలీసులకు అప్పగించిన ముగ్గురు పౌరులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రత్యేకంగా అభినందించారు.

బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సెజల్, గణపతి, కాశీనాథ్‌లను ఆయన ఘనంగా సన్మానించి.. వారికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు రివార్డును అందజేశారు.

ఏప్రిల్ 14న సెజల్ తన స్నేహితుడు గణపతితో కలిసి యూసుఫ్‌గూడ నుండి మాదాపూర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 సమీపంలో ఒక వ్యక్తి చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని వీరు గమనించారు.

ఆ చిన్నారి కళ్లలో భయాన్ని చూసి చలించిపోయిన వారు, తక్షణమే స్పందించి అటుగా వెళ్తున్న కాశీనాథ్, శ్రీ నారాయణల సాయంతో నిందితుడిని అడ్డుకున్నారు. బాలికను సురక్షితంగా రక్షించడమే కాకుండా, డయల్ 100కు సమాచారం అందించి నిందితుడిని పోలీసులకు పట్టించారు.

పోలీసుల విచారణలో నిందితుడు యూసఫ్ గూడకు చెందిన జావీద్ అనే వ్యక్తిగా తేలింది. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో, ఆ చిన్నారికి ఐస్‌క్రీమ్ కొనిస్తానని మభ్యపెట్టి తన బైక్‌పై తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు నిర్ధారణ అయ్యింది.

నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ సజ్జనర్ మాట్లాడుతూ.. సమయస్ఫూర్తితో, సామాజిక బాధ్యతతో వ్యవహరించిన యువతను కొనియాడారు.

వీరి సాహసం సమాజానికి ఒక గొప్ప సందేశమని, మహిళలు, చిన్నారుల రక్షణలో పౌరులు ఇలాగే అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను అరికట్టవచ్చు అని ఆయన అన్నారు.

నేరాల నియంత్రణలో పోలీసులు ఎంత కృషి చేసినా, పౌర చైతన్యం తోడైనప్పుడే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

You may also like
ఏటీఎం కేంద్రాలే టార్గెట్.. ‘ఫేక్ ఫోన్ పే’ యాప్‌తో నిలువు దోపిడీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions