BJP Victory In Delhi Assembly Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది.
27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 70 సీట్లకు గాను 48 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మరోవైపు ఆప్ 22 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ విజయం పట్ల ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
కాగా ఆప్ అగ్ర నేతలు మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి పాలవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నైరాశ్యానికి గురి చేసింది. అయితే ఒకవేళ కాంగ్రెస్ ఆప్ పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవనే విశ్లేషణలు వస్తున్నాయి.
దీనికి కారణం లేకపోలేదు. సుమారు 14 నియోజకవర్గాల్లో ఆప్ ఓడిపోయిన ఓట్ల కంటే కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లే ఎక్కువ. అర్వింద్ కేజ్రీవాల్ పోటీచేసిన న్యూ ఢిల్లీ స్థానంలో కూడా ఇదే పరిస్థితి. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ చేతిలో కేజ్రీవాల్ 4089 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కానీ ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సందీప్ దీక్షిత్ కు 4568 ఓట్లు వచ్చాయి. కలిసి పోటీచేసి ఉంటే కేజ్రీవాల్ స్వల్ప మెజారిటీతోనైనా గెలిచేవాడు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే మనీష్ సిసోడియా పోటీచేసిన చోట కూడా ఇదే పరిస్థితి. జంగపూరలో బీజేపీ అభ్యర్థి 675 ఓట్ల మెజారిటీతో సిసోడియాపై నెగ్గారు.
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 7350 ఓట్లు వచ్చాయి. ఇలా 14 చోట్ల ఆప్ విజయావకాశాలపై కాంగ్రెస్ తీవ్ర ప్రభావం చూపింది.