N Ramchander Rao Slams Congress దేశ రాజకీయాల్లో అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టలేక, ప్రధాని నరేంద్ర మోదీ గారి తల్లిదండ్రులపై కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత దూషణలకు దిగడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని, ఆ పార్టీ అగ్రనేతల వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
హద్దులు దాటిన భాష..
కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడుతున్న భాష, పదజాలం అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని, ప్రధాని కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ నేత పాట్నా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై, ఆయన తండ్రిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.
ఓర్వలేకే ఈ దిగజారుడుతనం..
ఒక సామాన్య ‘చాయ్‌వాలా’ దేశ ప్రధాని కావడాన్ని కాంగ్రెస్ తహతహ సహించలేకపోతోందని, గత పన్నెండున్నర సంవత్సరాలుగా అధికారానికి దూరమవ్వడంతో తీవ్ర నైరాశ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని దుయ్యబట్టారు. తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలనే తొందరలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తూ, ప్రధానిపై వ్యక్తిగత దాడికి దిగుతోందని విమర్శించారు.
తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపు..
కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అహంకారపూరిత ధోరణికి నిరసనగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనం చేపడతామని ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు.











