Sonia Gandhi Joins Instagram కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్పర్సన్ సోనియా గాంధీ అధికారికంగా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికలోకి అడుగుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇస్తూనే ఆమె తన రాబోయే జ్ఞాపకాల పుస్తకం (Memoir) ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) తొలి లుక్‌ను వీడియో రూపంలో పంచుకున్నారు.
ఈ సందర్భంగా సోనియా గాంధీ తన మొదటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో కృతజ్ఞతలు తెలుపుతూ.. “ఈ క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తక మొదటి లుక్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాను” అని పేర్కొన్నారు. “ఇది ప్రేమ, బాధ్యత, నష్టం మరియు మనకంటూ ఒక చోటును వెతుక్కునే ప్రయాణానికి సంబంధించిన కథ. దీనిని మీతో పంచుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆమె రాసుకొచ్చారు.
పుస్తక విశేషాలు & జ్ఞాపకాల ప్రయాణం..
ఇటలీలో ఆమె బాల్యం, కేంబ్రిడ్జ్‌లో చదువుకునే రోజుల్లో రాజీవ్ గాంధీతో పరిచయం, ఆ తర్వాత భారతదేశానికి రావడం, తన భర్త రాజీవ్ గాంధీ మరియు అత్తగారు ఇందిరా గాంధీ హత్యల తర్వాత తన జీవితంలో చోటుచేసుకున్న తీవ్రమైన వ్యక్తిగత మార్పులను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రముఖ పబ్లిషర్ ‘ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్’ (Alfred A Knopf) సంస్థ ఈ పుస్తకాన్ని నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించింది.
రాహుల్ గాంధీ భావోద్వేగం..
తన తల్లి పుస్తకం విడుదలపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఎంతో గోప్యంగా ఉండే మీ జీవిత కథను ప్రపంచంతో పంచుకోవడం ఎంత కష్టమో తనకు తెలుసని, నేడు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పైనుంచి ఆయన ఎంతో గర్వంగా మిమ్మల్ని చూస్తూ ఉంటారని రాహుల్ పేర్కొన్నారు.











