PM Modi On Paper Leak Cases | రాజధానిలో విద్యార్థుల నిరసనలు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు.
పేపర్ లీక్ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసి, బాధ్యులకు కఠినంగా శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
సోషల్ మీడియా వేదిక ‘X’ ద్వారా ప్రధాని మోదీ స్పందిస్తూ.. మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటంలో భాగమే ఈ నిర్ణయమని తెలిపారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎంతమాత్రం వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు.
ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాని వివరించారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా ప్రధాని మోదీ పేపర్ లీక్స్ అంశాన్ని ‘ఘోర పాపం’ అని అభివర్ణించిన సంగతి తెలిసిందే.
రాహుల్ గాంధీ తీవ్ర ఎదురుదాడి..
ప్రధాని మోదీ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు. ‘X’ వేదికగా స్పందిస్తూ, యువత భవిష్యత్తుకు అత్యంత ఎక్కువ హాని చేసింది మీరేనంటూ ప్రధానిపై మండిపడ్డారు.
విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి ప్రభుత్వం అనుమతించిందని, దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ రక్షిస్తోందని ఆరోపించారు. గత 10 ఏళ్లలో 150కి పైగా పేపర్ లీక్‌లు జరిగాయని, కానీ ఒక్క కేసులో కూడా నేరస్థులకు శిక్ష పడలేదని విమర్శించారు.
రాహుల్ గాంధీ విద్యార్థుల ప్రధాన డిమాండ్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలి.
- విద్యార్థులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.
- నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
పార్లమెంట్లో గందరగోళం:
మరోవైపు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు మరియు ‘బొద్దింకల జనతా పార్టీ’ (సీజేపీ) నిరసనకారులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్లో ఎలాంటి చర్చకైనా విద్యాశాఖ మంత్రి రాజీనామానే తమ ప్రధాన షరతు అని విపక్షాలు స్పష్టం చేశాయి.
అయితే, సభలో చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాజీనామాను షరతుగా పెట్టి ప్రతిపక్షాలే చర్చను కావాలని అడ్డుకుంటున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.










