TN CM Vijay Corruption Allegations On DMK తమిళనాడు శాసనసభలో డీఎంకే (DMK) పార్టీపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత డీఎంకే పాలనలో కాంట్రాక్టర్ల నుంచి ‘పార్టీ నిధుల’ పేరిట భారీగా లంచాలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. లంచాలను రుణం తీసుకుని ఈఎంఐ (EMI) చెల్లించినట్లుగా దఫాలవారీగా వసూలు చేశారని ఈడీ (ED) పత్రాన్ని ఉటంకిస్తూ సభలో పేర్కొన్నారు.
విజయ్ చేసిన ప్రధాన ఆరోపణలు..
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు వాటర్ సప్లై విభాగాల్లో కాంట్రాక్టర్ల నుంచి 7.5 శాతం నుండి 10 శాతం వరకు లంచాలు వసూలు చేశారని విజయ్ ఆరోపించారు. అవినీతికి ఆధారాలు చూపాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా, ఈడీ ఆధారాలనే విజయ్ శాసనసభలో చదివి వినిపించారు.
ఈ వసూలు చేసిన లంచాల నుంచి ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరియు మరికొందరు ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఉన్నారని ఈడీ నివేదిక పేర్కొందని తెలిపారు.
మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. 1970ల నాటి వీరాణం నీటి పథకంలో కూడా డీఎంకే మారణ్ ద్వారా 2.5 శాతం పార్టీ నిధులు డిమాండ్ చేశారని పాత సంఘటనలను గుర్తుచేశారు.
ఈ కుంభకోణంలో ఐఏఎస్ అధికారులతో పాటు రతీష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన దుబాయ్‌కి పారిపోయారని విజయ్ తెలిపారు.








