KSRTC Luxury Bus Flight Like Facilities | కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ప్రారంభించిన నూతన ప్రీమియం బిజినెస్ క్లాస్ బస్సు సేవలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
తిరువనంతపురం మరియు కొచ్చి మధ్య నడిచే ఈ హైఎండ్ బస్సు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. వ్లాగర్ అజయ్ జోనీ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఈ బస్సు అంతర్గత దృశ్యాలు (ఇంటీరియర్) ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
విమానం తరహా సదుపాయాలు..
ఈ వోల్వో బస్సులో 36 రెక్లైనింగ్ లేదర్ సీట్లు ఉన్నాయి. ప్రతి సీటు వద్ద పర్సనల్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల అనుకూలత కోసం బస్సులోనే పరిశుభ్రమైన ఇన్-బిల్ట్ వాష్రూమ్/టాయిలెట్ వసతి కల్పించారు. విమానాల తరహాలోనే బస్సులో ప్రత్యేకంగా ‘బస్సు హోస్టెస్’ సేవలు అందుబాటులో ఉన్నాయి.
టిఫిన్ & ప్యాంట్రీ సిస్టమ్..
ప్యాంట్రీలో కాఫీ మేకర్, మిని రిఫ్రిజిరేటర్ ఉన్నాయి. ప్రయాణికులకు వేడి పానీయాలు, షావర్మా రోల్స్ వంటి స్నాక్స్ అందిస్తున్నారు. ఉచిత వై-ఫై (Free Wi-Fi) సదుపాయంతో పాటు ప్రతి సీటు వద్ద యూఎస్బీ (USB) ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంచారు. సుమారు 200 నుండి 227 కిలోమీటర్ల దూరమున్న తిరువనంతపురం – ఎర్నాకుళం/కొచ్చి మార్గంలో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.









