- ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్ చేయాలని మంత్రి వివేక్ డిమాండ్!
Minister Vivek Demands Dismissal Of Tata Madhu తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే మొత్తం దళిత సమాజాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. సభ నుంచి తాతా మధును వెంటనే డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి, శాసన వ్యవస్థ గౌరవానికి తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దళితుడు కాబట్టే బీఆర్ఎస్ నాయకులు ఆయనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆరోపించారు. ఈ అంశాన్ని దళిత సంఘాలు కూడా గమనించాలని కోరారు. పదేళ్ల పాలనలో దళితుడిని సీఎం చేస్తానని, 3 ఎకరాల భూమి ఇస్తామని, నిరుద్యోగ భృతి మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయిందని, ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన హామీలను రాబోయే రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.










