CM Revanth Assembly Speech తెలంగాణ శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్పీకర్ స్థానం అత్యున్నతమైనదని, ఆయన మనసు గాయపడేలా మాట్లాడటం తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు.
ఈ రోజు తెలంగాణ చరిత్రలో ఒక చీకటి రోజు అని ఆయన అభివర్ణించారు. సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా స్పీకర్ ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. స్పీకర్‌ను మరియు ఆయన కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడటం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక వైఖరి..
దళితుడిని సీఎం చేస్తానని, 3 ఎకరాల భూమి ఇస్తానని బీఆర్‌ఎస్ దళితులను మోసం చేసిందని ఆరోపించారు. గతంలో దళిత డిప్యూటీ సీఎంను భర్తరఫ్ చేశారని, ప్రతిపక్ష హోదా రాకుండా సీఎల్పీ నాయకుడిని తొలగించారని గుర్తుచేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభను, స్పీకర్‌ను దూషించిన ఆ సభ్యుడితో రాజీనామా చేయించాలని, ఆయన సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సంయమనం పాటిస్తే చేతకానితనం అనుకోవద్దని హెచ్చరించారు. వ్యవస్థలను అదరించి, బెదిరించి లొంగదీసుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.











