Supreme Court Slams Delhi Executive Magistrate ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయ విద్యార్థి అక్షత్ త్రిపాఠికి గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గతంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, నోటీసులు ఇవ్వడానికి ఎంత ధైర్యమని ధర్మాసనం ప్రశ్నించింది.
ఉత్తర్వుల ఉల్లంఘనపై ఆగ్రహం..
ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు ఆదేశాలను ఏ మేజిస్ట్రేట్ కూడా ఉల్లంఘించలేరని సీజేఐ స్పష్టం చేశారు. సిజెపి నిరసనలో పాల్గొంటూ ఇతర విద్యార్థులను రెచ్చగొడుతున్నారనే పోలీసు నివేదిక ఆధారంగా రూ. 5 లక్షల పర్సనల్ బాండ్ సమర్పించాలని సెప్టెంబర్ 4న ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విద్యార్థికి నోటీసు ఇచ్చారు.
కోర్టు ధిక్కరణను ప్రశ్నించిన లాయర్..
ఈ నోటీసును పోలీసులు తర్వాత ఉపసంహరించుకున్నప్పటికీ, నోటీసు వెనక్కి తీసుకున్నంత మాత్రాన సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన (కోర్టు ధిక్కరణ) పోదని సీనియర్ అడ్వకేట్ బిశ్వజిత్ భట్టాచార్య వాదించారు. ఈ అంశంపై పూర్తి వివరాలను రికార్డుల్లో ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం, గ్రేటర్ నోయిడా అథారిటీ నుంచి వివరణ కోరనున్నట్లు తెలిపింది.
నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాలపై జూన్ 20న మొదలైన ఈ నిరసన, నాటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది. జూలై 20-25 మధ్య విద్యార్థులపై నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు రద్దు చేసింది.








