Adipurush Movie Tickets | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో సీత పాత్రలో క్రితి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మించారు.
రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు కూడా ముందుకు వస్తున్నారు. రామాయణంపై అభిమానంతో వేల సంఖ్యలతో టికెట్లు బుక్ చేసి ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ 10000 టిక్కెట్లు, టాలీవుడ్ నుండి రామ్ చరణ్ 10000 టిక్కెట్లు మరియు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా 10000 టిక్కెట్లు కొనుగోలు చేసి అనాథలు మరియు ఎన్జీవోలకు ఇవ్వనున్నారు.
అదేవిధంగా రామాయణ పారాయణం జరిగే చోటుకి ఆంజనేయుడు వస్తాడనే విశ్వాసం ఉన్న నేపథ్యంలో ఆది పురుష్ ప్రదర్శితం అయ్యే ప్రతి సినిమా హాల్ లో హనుమంతుడి కోసం ఒక సీటు ఖాళీ సీటు ఉంచాలని చిత్ర బృందం నిర్ణయించింది.
అయితే ఇప్పుడు ఈ సీటుకు సంబంధించి ఒక పుకారు చక్కర్లుకొడుతోంది. ఆంజనేయుడి కోసం కేటాయించిన సీటు పక్కన సీటు టికెట్ ను భారీ ధరకు విక్రయిస్తున్నారని సీనీ సర్కిళ్లలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
‘ఆదిపురుష్’ టిక్కెట్లపై రకరకాల వార్తలు వస్తున్నాయి. హనుమంతరావు పక్కన సీటు టిక్కెట్టును భారీ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ టికెట్ కూడా అన్ని సీట్ల ధరకే అమ్ముతున్నారు. ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదు. అలాంటి రూమర్స్ సృష్టించవద్దు’’ అని ట్వీట్ చేసింది.