Digital Punishment For Open Urination | బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన (Open Urination) చేస్తూ పట్టుబడితే.. జరిమానాలు విధించడం, గోడలపై దేవుళ్ల బొమ్మలు వేయడం లాంటి పాత పద్ధతులకు స్వస్తి చెప్పింది అస్సాంలోని ఓ మున్సిపాలిటీ.
నడిరోడ్డుపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వారి సిగ్గు విడిచేలా సరికొత్త డిజిటల్ శిక్షను అమలు చేస్తోంది. అస్సాంలోని టిన్సుకియా (Tinsukia) పట్టణ మున్సిపాలిటీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
డిజిటల్ స్క్రీన్లపై ‘లైవ్ షేమింగ్’..
టిన్సుకియా మున్సిపల్ బోర్డు అధికారులు పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ఎంత చెప్పినా వినని వారి కోసం ఈ ‘నేమ్ అండ్ షేమ్’ (Name and Shame) విధానాన్ని ఎంచుకున్నారు.
పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా మూత్ర విసర్జన చేస్తూ సీసీటీవీ (CCTV) కెమెరాలకు చిక్కితే.. వారి ఫోటోలను, వీడియోలను మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద ఎల్ఈడీ (LED) స్క్రీన్‌లపై బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు.
నలుగురూ చూసేలా తమ తప్పును స్క్రీన్‌లపై వేయడంతో తప్పు చేసిన వారు తీవ్ర అవమానానికి గురవుతున్నారు. ఈ భయంతోనైనా ప్రజల్లో మార్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
జనాలు ఏమంటున్నారంటే..?
అస్సాం మున్సిపాలిటీ తీసుకున్న ఈ వినూత్న చర్యపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు.
“ఇలాంటి కఠినమైన, వినూత్నమైన పద్ధతులను దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రవేశపెట్టాలి. అప్పుడే బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ఉమ్మివేయడం, మద్యం సేవించడం, మూత్ర విసర్జన చేయడం వంటి అసభ్యకరమైన ఘటనలు తగ్గుముఖం పడతాయి.
కేవలం జరిమానాలు విధిస్తే ఎవరూ భయపడటం లేదు కానీ, ఇలా సమాజంలో పరువు పోతుందనే భయం ఉంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది.” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు.
స్వచ్ఛ భారత్ లక్ష్యాలను సాధించడానికి మరియు పౌరులలో కనీస సామాజిక బాధ్యతను పెంచడానికి ఇటువంటి డిజిటల్ నిఘా, బహిరంగ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.









