Thursday 11th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆమె హోమ్ మేకర్ కాదు.. ‘నేషన్ బిల్డర్’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

ఆమె హోమ్ మేకర్ కాదు.. ‘నేషన్ బిల్డర్’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

  • ఇంటి పనిని తక్కువ అంచనా వేయొద్దు
  • వారి సేవలకు నెలకు కనీసం రూ.30 వేల విలువ
  • కుటుంబమే కాదు దేశ నిర్మాణంలోనూ గృహిణుల పాత్ర కీలకమన్న అత్యున్నత న్యాయస్థానం

SC Calls Homemakers As Nation Builders | గృహిణుల కృషికి చట్టపరమైన గుర్తింపు కల్పించే దిశగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక వ్యాఖ్యలు చేసింది. ఇంటి నిర్వహణ, కుటుంబ సభ్యుల సంరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసే గృహిణులను “నేషన్ బిల్డర్స్” (దేశ నిర్మాతలు)గా గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. భార్య అందించే గృహ సేవలు కోల్పోతే వాటి విలువను కనీసం నెలకు రూ.30 వేలుగా పరిగణించాలని పేర్కొంది. న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఎన్.కే. సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయిన ఓ వ్యక్తికి అదనపు పరిహారం మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది.

Read Also: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనమా..? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్!

గృహిణులే నిజమైన దేశ నిర్మాతలు..

తీర్పు సందర్భంగా ధర్మాసనం గృహిణుల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబ సభ్యులను తీర్చిదిద్దడం, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ ద్వారా గృహిణులు దేశ అభివృద్ధికి పరోక్షంగా సహకరిస్తారని పేర్కొంది. “ఒక గృహిణి కేవలం ఇంటి పనులు చేసే వ్యక్తి మాత్రమే కాదు. ఆమె మానవ వనరులను తీర్చిదిద్దుతుంది. దేశ భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆమెను ‘నేషన్ బిల్డర్’గా గుర్తించాల్సిన అవసరం ఉంది” అని ధర్మాసనం అభిప్రాయపడింది.

సంపాదించే వారే కాదు.. వారిని నిలబెట్టేది గృహిణులే..

గృహిణులను కుటుంబంలోని సంపాదించే సభ్యులపై ఆధారపడే వ్యక్తులుగా అభివర్ణించడం వ్యంగ్యంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఇంట్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే సభ్యులు తమ దైనందిన జీవితాన్ని కొనసాగించగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం గృహిణులేనని పేర్కొంది. కుటుంబ వ్యవస్థ మొత్తం గృహిణి చుట్టూనే తిరుగుతుందని, అయినప్పటికీ వారి కృషికి తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. “సంపాదించే వ్యక్తులు గృహిణులపై ఆధారపడతారు. కానీ ఈ వాస్తవాన్ని సమాజం ఇప్పటికీ పూర్తిగా గుర్తించలేదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇకపై ‘హౌస్‌వైఫ్’ కాదు.. ‘నేషన్ బిల్డర్’.. (SC Calls Homemakers As Nation Builders)

భవిష్యత్తులో “హౌస్‌వైఫ్” లేదా “హోమ్‌మేకర్” అనే పదాల స్థానంలో “నేషన్ బిల్డర్” అనే పదాన్ని ఉపయోగించే పరిస్థితి రావాలని సుప్రీంకోర్టు ఆకాంక్ష వ్యక్తం చేసింది. ఇంటి కోసం జీవితాంతం శ్రమించే మహిళల సేవలకు సామాజిక, ఆర్థిక గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ప్రమాద పరిహార కేసుల్లో కీలక ప్రభావం..

పంజాబ్‌లో 2001 నవంబర్ 25న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ మహిళ కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. మృతురాలి భర్త, ముగ్గురు పిల్లలు మొదట మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా వారికి రూ.2.42 లక్షల పరిహారం మంజూరైంది. అనంతరం హైకోర్టును ఆశ్రయించగా పరిహారం మొత్తాన్ని రూ.8.43 లక్షలకు పెంచుతూ 7.5 శాతం వడ్డీ కూడా మంజూరు చేసింది. అయితే ఆ మొత్తంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కేసును విచారించిన సుప్రీంకోర్టు గృహిణి అందించే గృహ సేవల విలువను పరిగణనలోకి తీసుకుని అదనపు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఏడాదిలోపు ప్రమాద పరిహార కేసులు పరిష్కరించాలి..

మోటార్ ప్రమాద పరిహార కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులను సాధ్యమైనంత వరకు ఒక ఏడాది వ్యవధిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బాధిత కుటుంబాలు న్యాయం కోసం దశాబ్దాల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని ధర్మాసనం పేర్కొంది.

You may also like
supreme court
పెళ్లికి ముందు శారీరక సంబంధంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
18 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగ మెమో.. రిటైర్మెంట్ వయసులో జాయినింగ్ లెటర్!
Pema Khandu
అరుణాచల్ సీఎం పెమా ఖండూకు సుప్రీం షాక్!
mahakal samay
జీఎంటీ స్థానంలో ‘మహాకాళ్ స్టాండర్డ్ టైం’!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions