Friday 5th June 2026
12:07:03 PM
Home > తాజా > కాళేశ్వరానికి లక్ష కోట్లు.. పాలమూరుకు గుండుసున్నా!

కాళేశ్వరానికి లక్ష కోట్లు.. పాలమూరుకు గుండుసున్నా!

  • కేసీఆర్ ది పదేళ్ల కమీషన్ల పాలన
  • సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
  • సాగునీటి అప్పులు, పాలమూరు నిర్లక్ష్యంపై ఆగ్రహం!

CM Revanth Slams KCR | తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని భావించిన ప్రజలను గత ప్రభుత్వం దారుణంగా వంచించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమే లక్ష్యంగా తాము కంకణం కట్టుకున్నామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వ పదేళ్ల సాగునీటి దోపిడీని, కమీషన్ల పర్వాన్ని గణాంకాలతో సహా ఎండగట్టారు.

గత పదేళ్ల కేసీఆర్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 1 లక్ష 81 వేల కోట్లు ఖర్చు చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తం ఖర్చులో ఏకంగా ఒక లక్ష కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే తగలేశారని ఆరోపించారు. అత్యంత కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

పదేళ్ల సుదీర్ఘ కాలంలో పాలమూరు ఎత్తిపోతలకే కేసీఆర్ రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టారని, అది కూడా కేవలం పంపులు, లిఫ్టుల కోసమే వేల కోట్లు ఖర్చు చేసి కమీషన్లు కొల్లగొట్టేందుకేనని విమర్శించారు. ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వకుండా ప్రాజెక్టును ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్లారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా మొట్టమొదట చేయాల్సింది భూసేకరణే అని, కానీ జిల్లాలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా అవసరమైన భూసేకరణే జరగలేదన్నారు.

భూసేకరణ పూర్తి చేయకుండానే ప్రాజెక్టులు పూర్తవుతాయని కేసీఆర్ ఎలా భావించారని విమర్శించారు. ఆయన ఆలోచన ఎంతసేపూ వేలకోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించి కమీషన్లు కొట్టేయడమేనని దుయ్యబట్టారు. దీనిపై నాగం జనార్దన్ రెడ్డి గారు ఎన్నో ఏళ్లుగా కొట్లాడారని గుర్తుచేశారు.

 గత ప్రభుత్వ అప్పులను తీరుస్తూనే తాము ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పదేళ్లలో కేసీఆర్ కట్టిన అప్పు రూ. 84,503 కోట్లు కాగా.. తాము అధికారంలోకి వచ్చిన 30 నెలల్లోనే ఏకంగా రూ. 52,120 కోట్ల అప్పులు కట్టామని వెల్లడించారు.

పాలమూరు కోసం రూ. 8 వేల కోట్లు..
ఈ 30 నెలల్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది రూ. 22 వేల కోట్లు మాత్రమేనని, అందులో రూ. 8 వేల కోట్లు కేవలం పాలమూరు ప్రాజెక్టుల కోసమే ఖర్చు పెట్టామని సీఎం వివరించారు. 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్‌ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు

అంచనాల్లో 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయని, ఆ సైన్స్, మ్యాథ్స్ ఏంటో తనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. “నేనేం 80 వేల పుస్తకాలు చదవలేదు” అంటూ కేసీఆర్‌పై ఇండైరెక్ట్ సెటైర్లు వేశారు.

రెండేళ్లలో పనులు పూర్తి..
జిల్లాలో పుట్టి పెరిగిన వాడిగా ఈ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తెచ్చేందుకే తాను పర్యటిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా 4 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని, రాబోయే రెండేళ్లల్లో జిల్లాలో పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నామని చెప్పారు.

భూసేకరణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. తాము పనులు పూర్తి చేస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ కార్యాచరణతో ముందుకొస్తున్నారని, వాళ్ళు చేసిన పాపాలు పోవాలంటే కాశీ వరకు నడవాలని హితవు పలికారు. జిల్లా బీఆర్‌ఎస్ నేతలు ఈ రెండేళ్లు ఏం మాట్లాడకపోవడమే వారు జిల్లాకు చేసే పెద్ద సాయమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

You may also like
Ponnam Prabhakar
పవన్ కళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే!
cm revanth reddy
కవిత కొత్త పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్!
kcr
‘అదో రియల్ ఎస్టేట్ దందా.. దాన్ని తీసి అవతల పడేస్తాం’
BJP Kishan REddy
రేవంత్ రెడ్డివి అబద్ధాల రాజకీయాలు: కిషన్ రెడ్డి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions