Annamalai Announces New Political Party | తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత అన్నామలై సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
శుక్రవారం ఉదయమే అన్నామలై తన పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారు.
ఈ పరిణామం వెలువడిన కొద్దిసేపటికే అన్నామలై సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేసి, తన భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేశారు.
తమిళ ప్రజల కోసమే నూతన వేదిక..
తమిళనాడు ఆత్మగౌరవాన్ని, ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం ఒక నూతన రాజకీయ వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందని అన్నామలై ఆ వీడియోలో వెల్లడించారు.
వాస్తవానికి తాను గతేడాది డిసెంబర్ 4వ తేదీనే పార్టీని వీడాలనే నిర్ణయాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, అప్పట్లో ఉన్న ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వేచి ఉండాలని బీజేపీ అధిష్టానం సూచించడంతో.. వారి మాటను గౌరవించి ఇన్నాళ్లూ పార్టీలోనే కొనసాగినట్లు వివరించారు.
పొత్తుల వివాదమే రాజీనామాకు కారణం?
తమిళనాడులో బీజేపీ అనుసరిస్తున్న కొన్ని రాజకీయ వ్యూహాలు, విధానాలతో అన్నామలై గత కొంతకాలంగా తీవ్రంగా విభేదిస్తున్నారు. ముఖ్యంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే (AIADMK) పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అధిష్టానం ఆలోచనను అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ పొత్తుల వ్యవహారంలో మొదలైన మనస్పర్థలు చివరకు ఆయన పార్టీకి రాజీనామా చేసేంతవరకు దారితీశాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్థాపించబోయే నూతన పార్టీతోనే బరిలోకి దిగబోతున్నట్లు ఈ ఫైర్ బ్రాండ్ లీడర్ స్పష్టం చేశారు.
అయితే ఎన్నికల కంటే ముందే తమిళనాడు అంతటా ప్రజల సమస్యలపై ఒక భారీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు అన్నామలై ప్రకటించారు.







