- ఒకే రోజు 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం!
Pawan Kalyan Launches 2 Crore 50 Lakh Seed Balls Production ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ-అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త పర్యావరణ ఉద్యమానికి తెరలేపారు.
ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని ప్రసిద్ధ బటర్‌ఫ్లై పార్క్ లో శుక్రవారం ఉదయం నిర్వహించిన పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారు చేసే బృహత్తర ప్రక్రియకు పవన్ కళ్యాణ్ అధికారికంగా శ్రీకారం చుట్టారు.
ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేవలం పిలుపునిచ్చి ఊరుకోకుండా.. స్వయంగా విత్తన బంతుల తయారీలో పాల్గొన్నారు.
అక్కడకు విచ్చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పొదుపు సంఘాల (SHG) మహిళలు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి పవన్ కళ్యాణ్ స్వయంగా మట్టి, విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేశారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ వంటి వైవిధ్యమైన, మన దేశీయ వృక్ష జాతులకు చెందిన విత్తనాలతో ఈ సీడ్ బాల్స్‌ను సిద్ధం చేయడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రాంతాల్లో మెగా డ్రైవ్ః ఈ విత్తన బంతుల తయారీ కార్యక్రమం కేవలం మూలపాడుకే పరిమితం కాలేదు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షణ: పవన్ కళ్యాణ్ పిలుపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
మూలపాడు బటర్‌ఫ్లై పార్క్ వేదిక నుంచే పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా సాగుతున్న ఈ మెగా గ్రీన్ డ్రైవ్‌ను స్వయంగా వీక్షించి, అటవీ శాఖ అధికారులను, మహిళలను మరియు విద్యార్థులను అభినందించారు.







