Friday 17th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 18 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగ మెమో.. రిటైర్మెంట్ వయసులో జాయినింగ్ లెటర్!

18 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగ మెమో.. రిటైర్మెంట్ వయసులో జాయినింగ్ లెటర్!

  • కేరళలో వింత ఉదంతం!

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యామనే ‘అడ్వైస్ మెమో’ వస్తే ఏ అభ్యర్థికైనా కొండంత సంతోషం కలుగుతుంది. కానీ, కేరళకు చెందిన ఒక వ్యక్తికి మాత్రం ఆ మెమో తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఎందుకంటే, ఆ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఆయన చేతికి వచ్చేసరికి ఆయనకు ఉద్యోగంలో చేరే వయసు దాటిపోయి.. రిటైర్ అయ్యే వయసు (60 ఏళ్లు) వచ్చేసింది!

ర్యాంక్ లిస్ట్ గడువు ముగిసిపోయిన 18 ఏళ్ల తర్వాత కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) ఈ మెమో జారీ చేయడం గమనార్హం.

2005లో పరీక్ష.. 2026లో మెమో..
కేరళలోని మలప్పురం జిల్లా కాళికావుకు చెందిన అబ్దుల్ మజీద్ అనే వ్యక్తికి గత నెల కేరళ పీఎస్‌సీ నుంచి ఒక అడ్వైస్ మెమో వచ్చింది. పార్ట్ టైమ్ జూనియర్ అరబిక్ టీచర్‌గా ఆయన ఎంపికైనట్లు అందులో ఉంది.

 ఈ అపాయింట్‌మెంట్ వెనుక ఉన్న అసలు కథ వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. మజీద్ ఈ ఉద్యోగం కోసం 2005లో పీఎస్‌సీ పరీక్ష రాశారు. ఆయన ఎంపికైన ర్యాంక్ లిస్ట్ గడువు 2008లోనే ముగిసిపోయింది.

 ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది మజీద్ జీవితకాల కల. ర్యాంక్ లిస్ట్‌ లో పేరు రావడంతో ఎన్నో ఏళ్లు ఆశగా ఎదురుచూశారు. కానీ, అధికారుల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో కాలక్రమేణా ఆయన ఆశలు వదులుకున్నారు.

వయసు 60 ఏళ్లు దాటాక ఆ ఊహే మరిచిపోయారు. తీరా శనివారం మీడియా ముందుకు వచ్చిన ఆయన.. “పీఎస్‌సీ ఈ మెమో ఇవ్వడానికి 18 ఏళ్లు పట్టింది. ఈ పోస్టులో సేవలు అందించే వయసు, అర్హత నేను ఎప్పుడో కోల్పోయాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్వాహకుల వివరణ ప్రకారం.. పదే పదే నోటిఫికేషన్లు ఇచ్చినా, నియామక ప్రయత్నాలు చేసినా అర్హులైన అభ్యర్థులు లభించకపోవడంతో ఖాళీగా ఉండిపోయిన ఒక పోస్టు భర్తీ కోసం పాత లిస్ట్ ఆధారంగా ఈ నియామకం చేపట్టారు.  

నిబంధనల ప్రకారం.. అడ్వైస్ మెమో అందిన మూడు నెలల లోపు అభ్యర్థి తన ఒరిజినల్ పత్రాలను సమర్పించి విధుల్లో చేరాల్సి ఉంటుంది.

అయితే, మజీద్ ఎస్ఎస్ఎల్‌సీ (SSLC) సర్టిఫికేట్ ప్రకారం ఆయన పుట్టిన తేదీ మే 27, 1966గా నమోదై ఉంది. అంటే ఈపాటికే ఆయన 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసును దాటేశారు.

దీంతో ఇప్పుడు ఆయన ఆ ఉద్యోగంలో చేరడానికి సాంకేతికంగా పూర్తిగా అనర్హులయ్యారు. ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యం ఒక నిరుద్యోగి కలని ఎలా కాలరాస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం.

You may also like
యువ జంట ఆదర్శ వివాహం.. కట్నం ఎంతో తెలుసా!
ఇంట్లోకి చొరబడిన చిరుత.. కుక్కతో పాటు లోపల వేసి తాళం వేసిన యజమాని!
సౌత్ సీఎంలే రిచ్.. ఏడీఆర్ (ADR) నివేదికలో ఆసక్తికర అంశాలు!
ఈ20 ఇంధనం వాడితే బీమా రద్దు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions