Monday 1st June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నా సూట్ వెనుక ఉన్న సీక్రెట్ అదే: విమర్శలకు సీఎం విజయ్ చెక్!

నా సూట్ వెనుక ఉన్న సీక్రెట్ అదే: విమర్శలకు సీఎం విజయ్ చెక్!

  • డీఎంకే ఫ్యామిలీ పాలిటిక్స్ పై నిప్పులు..

Vijay Black and White Suit Political Message | తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత నిర్వహించిన మొదటి భారీ బహిరంగ సభలో ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన ‘కృతజ్ఞతా సభ’లో ఆయన మాట్లాడుతూ.. తన దుస్తులపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.

అలాగే డీఎంకే (DMK) రాజకీయ సంస్కృతిని తీవ్రంగా కడిగిపారేస్తూ.. తమిళనాడులో టీవీకే పార్టీయే ప్రధాన రాజకీయ శక్తీ అని స్పష్టం చేశారు.

బ్లాక్ అండ్ వైట్ సూట్ వెనుక ఉన్న మెసేజ్ ఇదే..
గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన తన కోట్-సూట్ ధారణపై విజయ్ అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“ఇప్పుడు చాలా మంది నేను సూట్లు వేసుకోవడంపై మాట్లాడుతున్నారు. మేము సూట్ ఎందుకు వేసుకోకూడదు? కేవలం అధికారంలో ఉన్నవారే సూట్లు వేసుకోవాలా? అలాంటి నియమం ఏమీ లేదు” అని విజయ్ మండిపడ్డారు.

తాను ఫ్యాషన్ కోసం కాకుండా ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడానికే సూట్లు ధరిస్తున్నట్లు విజయ్ వెల్లడించారు.

“నేనేమైనా రంగురంగుల సూట్లు వేస్తున్నానా? కేవలం నలుపు, తెలుపు (Black and White) రంగులు మాత్రమే వాడుతున్నాను.

విజయ్ అన్ని విషయాల్లోనూ ‘బ్లాక్ అండ్ వైట్’ (అత్యంత స్పష్టంగా, పారదర్శకంగా) ఉంటాడని చెప్పడానికే ఇది. నేను విడిగా చెప్పక్కర్లేదు, ఆ నలుపు దేనికి సంకేతమో మీ అందరికీ తెలుసు” అంటూ ద్రవిడ సిద్ధాంతాన్ని పరోక్షంగా గుర్తు చేశారు.

నేను ఎంజీఆర్ కాదు.. మీ విజయ్‌ని..
తన తొలి ఎన్నికల విజయాలను దివంగత సీఎం, ఐకాన్ ఎంజీఆర్ (MGR) తొలి విజయాలతో పోల్చడంపై విజయ్ స్పందించారు.

“తొలి ఎన్నికల్లో దివంగత సీఎం ఎంజీఆర్ కూడా ఇంతటి ఓట్ల శాతాన్ని సాధించలేదని చాలా మంది చెప్తున్నారు. కానీ మీరు టీవీకే పార్టీకి అంతకుమించిన భారీ మద్దతు ఇచ్చారు.

నేను నన్ను ఎంజీఆర్‌తో పోల్చుకోవడం లేదు. ఎంజీఆర్ ఎప్పటికీ ఎంజీఆరే. కానీ నేను మీ విజయ్‌ని.

ఎంజీఆర్, అన్నాదురై, పెరియార్ చూపించిన మార్గంలో మీ కోసం పనిచేయడానికి వచ్చిన మీ అన్నను, తమ్ముడిని” అని పేర్కొన్నారు.

తాను ముఖ్యమంత్రిని కాదని, ప్రజల “మొదటి సేవకుడిని” (First Sewak) అని ఎమోషనల్ అయ్యారు.

డీఎంకేపై తీవ్ర స్థాయిలో ఫైర్..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయానికి ఆ పార్టీ కుటుంబ రాజకీయాలే కారణమని విజయ్ ఆరోపించారు.

“నేను బాధ్యతలు స్వీకరించి కేవలం కొన్ని వారాలు మాత్రమే అయింది. ఆరు నెలల పాటు సైలెంట్‌గా ఉంటామని చెప్పిన వాళ్లు.. కనీసం ఆరు రోజులు కూడా ఓపిక పట్టలేక విమర్శలు మొదలుపెట్టారు” అని డీఎంకే నేతలపై ధ్వజమెత్తారు.

అటు డీఎంకే, ఇటు ఏఐఏడీఎంకే (AIADMK) ప్రజల తీర్పును గౌరవించకుండా గుర్రాల బేరాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూశాయని ఆరోపించారు.

ఇకపై తమిళనాడులో వేరే పార్టీలకు స్పేస్ లేదని.. రాబోయే రోజుల్లో అసలైన రాజకీయ పోరాటం కేవలం డీఎంకే మరియు టీవీకే మధ్యే ఉంటుందని విజయ్ సంచలన ప్రకటన చేశారు.

మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. 108 స్థానాలు గెలుచుకుని సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions