Saturday 10th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > CBSE నిర్ణయంపై బీజేపీ నేత అన్నామలై తీవ్ర అసంతృప్తి!

CBSE నిర్ణయంపై బీజేపీ నేత అన్నామలై తీవ్ర అసంతృప్తి!

Annamalai

‌– 9వ తరగతికి ‘మూడో భాష’ నిర్బంధం వద్దు..
– కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

K Annamalai Reacts To CBSE Third Language Rule | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవల జారీ చేసిన త్రిభాషా సూత్రం (Three-Language Rule) నోటిఫికేషన్‌పై తమిళనాడు బీజేపీ సీనియర్ నేత కె. అన్నామలై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మూడో భాషను నిర్బంధం చేయడం వల్ల వారిపై తీవ్రమైన అకడమిక్ ఒత్తిడి పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర విద్యాశాఖను కోరారు.

తమిళనాడులో ‘హిందీ రుద్దింపు’ కుట్ర జరుగుతోందంటూ విపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో.. స్థానిక ప్రజల, తల్లిదండ్రుల పక్షాన నిలబడుతూ అన్నామలై ఎక్స్ (X) వేదికగా చేసిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సీబీఎస్ఈ (CBSE) నోటిఫికేషన్‌లో అసలేముంది?
గత మే 15న సీబీఎస్ఈ జారీ చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.. 9, 10 తరగతుల భాషా విధానంలో పెద్ద మార్పులు చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ ఏడాది జూలై 1 నుండి సీబీఎస్ఈ స్కూళ్లలో 9వ తరగతి విద్యార్థులు ఖచ్చితంగా మూడు భాషలను (R1, R2, R3) చదవాల్సి ఉంటుంది.

భారతీయ భాషల నిబంధన.. ఈ మూడింటిలో కనీసం రెండు భాషలు ఖచ్చితంగా భారతదేశానికి చెందిన స్థానిక భాషలై ఉండాలి. విదేశీ భాషను ఎంచుకోవాలనుకుంటే, దానిని నాల్గవ అదనపు సబ్జెక్టుగా మాత్రమే తీసుకోవాలి. అయితే, 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఈ మూడో భాషకు ఎగ్జామ్ ఉండదని బోర్డు స్పష్టం చేసింది.

మాట తప్పిన సీబీఎస్ఈ.. తల్లిదండ్రుల్లో ఆందోళన!
గతంలో ఇచ్చిన హామీని సీబీఎస్ఈ ఉల్లంఘించిందని అన్నామలై తన ట్వీట్‌లో వేలెత్తి చూపారు. “గత ఏప్రిల్ 2026 నోటిఫికేషన్‌లో 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రాన్ని తెచ్చినప్పుడు చిన్న వయస్సులోనే ఎక్కువ భాషలు నేర్చుకుంటారని నేను స్వాగతించాను.

అదే నోటిఫికేషన్‌లో 9వ తరగతి పిల్లలకు మూడో భాషను 2029-30 విద్యా సంవత్సరం నుండి మాత్రమే నిర్బంధం చేస్తామని సీబీఎస్ఈ స్పష్టంగా చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చి, మూడేళ్ల ముందే ఈ ఏడాది జూలై 1 నుండే అమలు చేయడం సరికాదు” అని అన్నామలై విమర్శించారు.

విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి..
6వ తరగతిలోనే విద్యార్థులు తమకు నచ్చిన భాషను ఎంచుకుని చదువుతున్నారని.. ఇప్పుడు సడన్‌గా 9వ తరగతికి వచ్చేసరికి తక్కువ సమయంలో మరో కొత్త భారతీయ భాషను నేర్చుకోవాలని ఒత్తిడి చేయడం వల్ల పిల్లల ఓవరాల్ లెర్నింగ్ అవుట్‌కమ్స్ దెబ్బతింటాయని, ఇది ముఖ్యంగా తమిళనాడులోని విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద షాక్ అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions