- వెజ్ బిర్యానీ అడిగితే చికెన్ ఇచ్చి బుక్కయ్యారు..
- కన్జ్యూమర్ ఫోరం సంచలన తీర్పు!
Non Bailable warrant For Swiggy MD | ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం ‘స్విగ్గి’ (Swiggy) యాజమాన్యానికి ఊహించని షాక్ తగిలింది. ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ వివాదం చివరకు స్విగ్గి టాప్ మేనేజ్‌మెంట్ మెడకు చుట్టుకుంది.
కోర్టు ఆదేశాలను పదేపదే బేఖాతరు చేసిన నేపథ్యంలో.. బెంగళూరులోని స్విగ్గి మేనేజింగ్ డైరెక్టర్ (MD) సహా నలుగురు కీలక వ్యక్తులపై కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (కన్జ్యూమర్ ఫోరం) నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant) జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..
కర్నూలు జిల్లాకు చెందిన ఓ వినియోగదారుడు గతంలో స్విగ్గి యాప్ ద్వారా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని ‘న్యూ అప్సర హోటల్’ నుంచి వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ చేశారు.
అయితే, స్విగ్గి డెలివరీ బాయ్ తెచ్చిన పార్సెల్ ఓపెన్ చేసి చూడగా అందులో వెజ్ కు బదులు చికెన్ బిర్యానీ ఉంది.
పవిత్రంగా వెజ్ తినాలనుకున్న తనకు చికెన్ డెలివరీ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు కస్టమర్ న్యాయం కోసం కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
రూ. 55 వేల జరిమానా..
ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపట్టిన కన్జ్యూమర్ ఫోరం.. గతేడాది డిసెంబర్ 31న కీలక తీర్పు వెలువరించింది.
వినియోగదారుడికి జరిగిన నష్టానికి, మానసిక క్షోభకు ప్రతిఫలంగా స్విగ్గి నిర్వాహకులతో పాటు ఇతర ప్రతివాదులు కలిసి బాధితుడికి ₹50,000 నష్టపరిహారం, అలాగే కోర్టు ఖర్చుల కింద మరో ₹5,000 (మొత్తం రూ. 55 వేలు) చెల్లించాలని ఆదేశించింది.
కోర్టు తీర్పు ఇచ్చి నెలలు గడుస్తున్నా స్విగ్గి నిర్వాహకులు ఆ ఆదేశాలను పాటించలేదు. జరిమానా చెల్లించలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. చివరకు గురువారం తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
కోర్టు గడువు విధించినప్పటికీ స్విగ్గి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీసం ప్రతినిధులు కూడా హాజరుకాలేదు.
కోర్టు ఆర్డర్లను పదేపదే లెక్కచేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్.. బెంగళూరులోని స్విగ్గి ఎండీ, ఆ సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, బండ్ల టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీవెన్స్ ఆఫీసర్, అలాగే సదరు న్యూ అప్సర హోటల్ మేనేజర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్లు (NBW) జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.







