- కనీస వేతనాల పెంపు!
- జూన్ 1 నుంచి అమలు..
- ఎవరెవరికి ఎంత పెరిగిందంటే?
Telangana Minimum Wages Hike | రాష్ట్రంలోని కోటికి పైగా ఉన్న కార్మిక లోకానికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. శ్రమజీవుల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలను (Minimum Wages) భారీగా పెంచుతూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కార్మికుల వేతన పెంపును అధికారికంగా ప్రకటించారు. ఈ పెంచిన నూతన వేతనాలు వచ్చే జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కార్మిక ఉపాధి శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఈ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
నాలుగు కేటగిరీలు – మారిన జోన్లు..
రాష్ట్రంలో కార్మికులను వారి పనితనం ఆధారంగా అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా 4 విభాగాలుగా వర్గీకరించి ఈ వేతనాల పెంపును ఖరారు చేశారు.
అలాగే గతంలో కేవలం అర్బన్, రూరల్‌గా 2 జోన్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు వాటిని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటూ 3 జోన్లుగా విభజించి కనీస వేతనాలను శాస్త్రీయంగా నిర్ణయించారు.
కనీస వేతనాల పెంపు పూర్తి డేటా..
ద్రవ్యోల్బణం, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, పెరిగిన ఇళ్ల అద్దెలను దృష్టిలో ఉంచుకుని కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఈ క్రింది విధంగా జీతాలను పెంచింది.
| కార్మికుల కేటగిరీ | పాత కనీస వేతనం | పెంచిన నూతన వేతనం |
| అన్‌స్కిల్డ్ (Unskilled) | ₹12,750 | ₹16,000 |
| సెమీ స్కిల్డ్ (Semi-Skilled) | ₹13,592 | ₹17,000 |
| స్కిల్డ్ (Skilled) | ₹13,772 | ₹18,500 |
| హైలీ స్కిల్డ్ (Highly Skilled) | ₹14,607 | ₹20,000 |
గత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి పొలిటికల్ పంచ్!
“తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్ల హయాంలో కార్మికుల వేతన సవరణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులు తీవ్రంగా నష్టపోయారు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ప్రజా ప్రభుత్వం అధికారికంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ వేతన సవరణ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని (Cabinet Sub-Committee) నియమించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.
కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, అన్ని స్టేక్‌హోల్డర్లతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన తర్వాతే అందరికీ ఆమోదయోగ్యంగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు.
గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక రక్షణ..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్కిల్డ్ లేబర్ కొరత ఉందని, విదేశాలకు వెళ్లాలనుకునే తెలంగాణ కార్మికులను మోసం చేసే ఏజెంట్లపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు.
- ప్రత్యేక శిక్షణ: ముఖ్యంగా గల్ఫ్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే కార్మికులకు ప్రభుత్వం తరఫునే ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అక్కడి అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరిపి సురక్షితంగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రూ. 5 లక్షల పరిహారం: గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే మృతదేహాన్ని తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేదన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక బాధితులకు అండగా నిలిచామని చెప్పారు. - అంతేకాకుండా, మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గర్వంగా గుర్తుచేశారు.







