- హైదరాబాద్ స్పోర్ట్స్ హబ్‌పై సీఎం రేవంత్ కసరత్తు
- జూన్ 2న గచ్చిబౌలి స్టేడియం పునరాభివృద్ధికి శంకుస్థాపన!
CM Revanth Reddy meets Kavya Maran Sanjiv Goenka | తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను దేశంలోనే అత్యుత్తమ క్రీడా వేదికగా (Sports Hub) మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్తలు మరియు క్రీడా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ చైర్మన్ సంజీవ్ గోయెంకా (లక్నో సూపర్ జెయింట్స్ యజమాని), కో-చైర్మన్ ఉపాసన కొణిదెల, మరియు సభ్యురాలు కావ్య మారన్ (సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని) పాల్గొన్నారు. వారితో పాటు పలువురు ఉన్నతాధికారులు, క్రీడా రంగానికి చెందిన నిపుణులు ఈ చర్చల్లో భాగస్వాములయ్యారు.
హైదరాబాద్‌ను క్రీడారంగంలో దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యంగా గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పునరాభివృద్ధి చేయాలని ఆయన ఆదేశించారు.
జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ లోగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికను (Action Plan) సిద్ధం చేయాలని స్పోర్ట్స్ హబ్ కమిటీని కోరారు.
గచ్చిబౌలి స్టేడియంలో కేవలం క్రీడా సౌకర్యాలే కాకుండా, అంతర్జాతీయ అతిథుల కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్, ఆధునిక వసతులు మరియు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
క్రీడాకారులకు శిక్షణతో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు హైదరాబాద్ వేదిక కావాలని ఆకాంక్షించారు. గోయెంకా, కావ్య మారన్ వంటి అనుభవజ్ఞులైన ఫ్రాంచైజీ యజమానుల సలహాలతో హైదరాబాద్ స్పోర్ట్స్ హబ్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.






