Tuesday 7th July 2026
12:07:03 PM
Home > తాజా > కొమ్మిడి నరసింహారెడ్డి మృతికి కేసీఆర్ ప్రగాఢ సంతాపం!

కొమ్మిడి నరసింహారెడ్డి మృతికి కేసీఆర్ ప్రగాఢ సంతాపం!

KCR Condoles Kommidi Narasimha Reddy Death | తెలంగాణ ఉద్యమ సమరయోధుడు,  భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

తెలంగాణ సమాజానికి, ప్రజా జీవితానికి ఆయన చేసిన అపురూప సేవలను కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నరసింహారెడ్డిని ఒక నిజమైన ‘ప్రజాపురుషుడు’గా అభివర్ణించిన కేసీఆర్.. ఆయన తన రాజకీయ జీవితమంతా నిరాడంబరతకు, నిబద్ధతకు, నిజాయితీలకు నిదర్శనంగా నిలిచారని కొనియాడారు.

వందలాది ఎకరాలు పేదలకు పంపిణీ..

కొమ్మిడి నరసింహారెడ్డి కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సామాజిక ఉదారతను చాటుకున్న గొప్ప నాయకుడని కేసీఆర్ పేర్కొన్నారు. ఆచార్య వినోబాభావే నేతృత్వంలో సాగిన భూదాన్ ఉద్యమ సమయంలో ఈ సీనియర్ నాయకుడు స్పందించి, తన సొంత ఆస్తి అయిన వందలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు ఉచితంగా పంచిపెట్టి పెద్ద మనసు చాటుకున్నారని తెలిపారు.

1969 తెలంగాణ ఉద్యమం..

తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కొమ్మిడి నరసింహా రెడ్డి అగ్రభాగాన నిలిచారని, 1969 నాటి చారిత్రాత్మక పోరాటంలో అత్యంత చురుకుగా పాల్గొని ఉద్యమ వ్యాప్తికి కృషి చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంత నీటి హక్కుల కోసం నరసింహారెడ్డి చేసిన మేధోపరమైన పోరాటాన్ని కేసీఆర్ కొనియాడారు.

మూసీ నది పరిరక్షణ కోసం నరసింహారెడ్డి ఎంతగానో శ్రమించారని, అలాగే తెలంగాణ ప్రాంత బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి గోదావరి నదీ జలాలను సాధించాలంటూ ఆయన వినిపించిన బలమైన వాదనను, చూపిన మార్గాన్ని చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సమాజానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కొమ్మిడి నరసింహారెడ్డి అందించిన సేవలు ఎన్నటికీ భర్తీ చేయలేనివని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ నిరాడంబర నాయకుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ఈ పెద్ద నష్టాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

You may also like
‘లక్ష కోట్ల భూములను కాంగ్రెస్ పెద్దలకు కట్టబెడుతున్నారు’
harish rao
కేసీఆర్ ఆఫీసులో రేవంత్ ఫోటో.. హరీష్ హాట్ కామెంట్స్!
కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో.. గజ్వేల్‌లో హై టెన్షన్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions