- విపక్షాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు
Yogi Adityanath Slams SP Congress | రామ మందిర విరాళాల అపహరణ కేసు విషయంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, అయోధ్యలో జరిగిన ఒకే ఒక్క ఘటనను పట్టుకుని హిందూ విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, వక్ఫ్ భూముల అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నాయని నిలదీశారు.
సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల రాజకీయ యూ-టర్న్‌లను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు.
Also Read: భర్త సిరల్లోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హతమార్చిన భార్య!
వక్ఫ్ అక్రమాలపై నోళ్లకు తాళాలు ఎందుకు?
రామ మందిర విరాళాల దొంగతనం కేసుపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు, వక్ఫ్ పేరుతో జరుగుతున్న భూ దొంగతనాలను ఎందుకు ప్రశ్నించడం లేదని ముఖ్యమంత్రి అడిగారు.
హిందూ విశ్వాసంతో ఆడుకోవడానికి అయోధ్య అంశాన్ని వాడుకుంటున్న ప్రతిపక్షాలు, వక్ఫ్ పేరుతో అమ్ముడుపోయిన వేలాది హెక్టార్ల భూమి గురించి ఒక్కసారైనా మాట్లాడాయా అని ప్రశ్నించారు.
ఈ భూమి నిజానికి పేదలు, బలహీన వర్గాలకు చెందిందని.. కానీ కొందరు వ్యక్తులు దానిని ఆక్రమించి, వక్ఫ్ పేరుతో అమ్ముకుని లబ్ధి పొందినా కాంగ్రెస్, ఎస్పీలు నోరు విప్పడం లేదని ఆరోపించారు.
అయోధ్య కేసులో విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే రామ జన్మభూమి ట్రస్ట్ సిట్ (SIT) దర్యాప్తు కోరిందని, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దోషులపై తక్షణ చర్యలు తీసుకున్నామని యోగి స్పష్టం చేశారు.
ఎన్నికల వేళ విభజన రాజకీయాలు..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాలు మళ్లీ కులం పేరుతో విభజన సృష్టించడానికి, ప్రజల విశ్వాసంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని సీఎం విమర్శించారు
“ఒకప్పుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అసలు లేరని కాంగ్రెస్ వాదించింది. అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మద్దతు తెలిపి మొసలి కన్నీళ్లు కార్చాయి.
శ్రీరాముడి ఉనికినే నిరాకరించిన పార్టీ, రామ భక్తులపై తూటాలు పేల్చిన సమాజ్‌వాదీ పార్టీ.. అసలు వీళ్ళు ఏ విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.
గత ప్రభుత్వాలు హిందూ పుణ్యక్షేత్రాల అభివృద్ధి నిధులను శ్మశానవాటికల ప్రహరీ గోడల కోసం దుర్వినియోగం చేశాయని, అక్రమ కబేళాలు నడిపి గోవులను వధకు తరలించినప్పుడు హిందూ విశ్వాసాలు దెబ్బతినలేదా అని యోగి నిలదీశారు.







