Monday 6th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఈ20 పెట్రోల్‌ వినియోగంపై మహీంద్రా కీలక ప్రకటన!

ఈ20 పెట్రోల్‌ వినియోగంపై మహీంద్రా కీలక ప్రకటన!

Mahindra Clarifies E20 Petrol | దేశవ్యాప్తంగా ప్రస్తుతం వాహనదారుల్లో ‘ఈ20 (E20) పెట్రోల్’ (20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం) పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఈ ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల వాహనాల ఇంజిన్లు పాడైపోతాయని, మైలేజ్ పడిపోతుందంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లు, పుకార్లు షేర్ అవుతున్నాయి.

అయితే, ఈ ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వ వాదన మొదటి నుంచీ భిన్నంగానే ఉంది. ఈ20 వల్ల కేవలం మైలేజ్ మాత్రమే స్వల్పంగా (సుమారు 6-7%) తగ్గుతుందని, అంతకుమించి ఇంజిన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లదని ప్రభుత్వం చెబుతోంది.

ఈ నేపథ్యంలో, తాజాగా ప్రముఖ స్వదేశీ వాహన తయారీ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra & Mahindra) ఈ వివాదంపై స్పందిస్తూ వినియోగదారులకు పక్కా స్పష్టతనిచ్చింది.

మహీంద్రా పెట్రోల్ కార్లన్నీ సురక్షితమే..

సోషల్ మీడియా వేదికగా ఒక కస్టమర్ అడిగిన ప్రశ్నకు మహీంద్రా అధికారికంగా స్పందించింది. తమ పెట్రోల్ వాహనాల్లో ఈ20 ఇంధనాన్ని ఎలాంటి భయం లేకుండా, పూర్తి సురక్షితంగా ఉపయోగించవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.

ఏప్రిల్ 1, 2025 తర్వాత మోడళ్లు..

ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఇంధన ప్రమాణాలకు అనుగుణంగానే తమ ఇంజిన్లను రీ-డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది.

ముఖ్యంగా 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన అన్ని కొత్త మహీంద్రా పెట్రోల్ వాహనాల ఇంజిన్లను ఈ20 ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా క్యాలిబ్రేట్ (Calibrate) చేసినట్లు వెల్లడించింది.

దీనివల్ల ఈ20 పెట్రోల్‌తో కూడా మెరుగైన యాక్సిలరేషన్, మంచి ఇంధన సామర్థ్యం లభిస్తాయని పేర్కొంది.

పాత వాహనాల పరిస్థితి..

2025 ఏప్రిల్ కన్నా ముందు తయారైన పాత మహీంద్రా పెట్రోల్ కార్లు కూడా ఈ20 ఇంధనంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తాయని కంపెనీ తేల్చిచెప్పింది.

అయితే, కస్టమర్ల డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులను బట్టి మైలేజ్ లేదా యాక్సిలరేషన్‌లో స్వల్ప మార్పులు (తగ్గుదల) కనిపించవచ్చని వివరించింది.

ఇతర ఆటోమొబైల్ దిగ్గజాల మద్దతు ఇదే..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ సంస్థలతో నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో దేశంలోని ఇతర ప్రముఖ కంపెనీలైన టయోటా, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, మరియు హ్యుందాయ్ ప్రతినిధులు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు.

ఈ20 ఇంధనం వాహనాలకు 100 శాతం సురక్షితమేనని, మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల మినహా ఇంజిన్ లోపలి భాగాలకు ఎలాంటి ముప్పు ఉండదని వారంతా స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహీంద్రా ఇచ్చిన వివరణతో స్పష్టమవుతోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions