Saturday 4th July 2026
12:07:03 PM
Home > తాజా > కవితకు ఈసీ బిగ్ షాక్.. పార్టీ పేరు మార్చాలని ఆదేశం!

కవితకు ఈసీ బిగ్ షాక్.. పార్టీ పేరు మార్చాలని ఆదేశం!

kavitha

15 రోజుల్లోగా కొత్త పేర్లు ఇవ్వకుంటే దరఖాస్తు రద్దు!

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది.

ఇటీవలే ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తన నూతన రాజకీయ పార్టీ పేరుపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వివిధ వర్గాల నుండి వచ్చిన ఫిర్యాదులు, తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో.. తన పార్టీ అయిన “తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)” పేరును తక్షణమే మార్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కవితను ఆదేశించింది.

15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయాలు ఇవ్వాలి..

ఈసీఐ నిబంధనల ప్రకారం కవితకు పంపిన అధికారిక లేఖలో పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త పేర్ల ప్రతిపాదన: రాబోయే 15 రోజుల్లోగా పార్టీకి సంబంధించిన మరో మూడు ప్రత్యామ్నాయ పేర్లను (3 Alternative Names) తమకు సమర్పించాలని ఈసీఐ స్పష్టం చేసింది.

 ఒకవేళ నిర్దేశించిన ఈ 15 రోజుల గడువులోగా ఆమె స్పందించడంలో లేదా కొత్త పేర్లను పంపడంలో విఫలమైతే.. ఎలాంటి తదుపరి నోటీసులు ఇవ్వకుండానే ఆమె పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా తిరస్కరిస్తామని (Reject) కమిషన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది.

‘టీఆర్ఎస్’ సంక్షిప్త రూపంపైనే ప్రధాన అభ్యంతరం..

కవిత తన పార్టీ పేరును ప్రకటించిన నాటి నుండి రాజకీయ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. తెలంగాణ రక్షణ సేనకు సంక్షిప్త రూపంగా ‘TRS’ అని వస్తుంది.

అయితే కేసీఆర్ స్థాపించిన పాత పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)’ కావడం, ఆ పార్టీ 2022లో ‘భారత్ రాష్ట్ర సమితి (BRS)’గా మారిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మళ్లీ కవిత అదే ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త పేరు వచ్చేలా పార్టీ పెట్టడం వల్ల భవిష్యత్తులో ఓటర్లలో తీవ్ర గందరగోళం సృష్టించే అవకాశం ఉందంటూ ఈసీఐకి పలు అభ్యంతరాలు దాఖలయ్యాయి.

పార్టీ ఏర్పాటుకు ముందు నుంచే కవిత పేరు ఎంపికపై కసరత్తు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కవిత ఈసీఐకి లేఖ రాస్తూ.. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి మరియు తెలంగాణ ప్రజా శక్తి వంటి ఐదు పేర్లను ప్రతిపాదించారు.

ఆ తర్వాత ఏప్రిల్ 25న మేడ్చల్‌లో భారీ బహిరంగ సభ ద్వారా కొత్త పార్టీని ప్రకటించి, దానికి మొదట ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని పేరు పెట్టారు. అయితే మూడు రోజుల తర్వాత (ఏప్రిల్ 28న) దానిని ‘తెలంగాణ రక్షణ సేన’గా మార్చారు.

ప్రజా ప్రకటనలో వచ్చిన అభ్యంతరాల ఆధారంగానే తుది ఆమోదం ఉంటుందని ఈసీఐ ముందే స్పష్టం చేయడంతో.. ఇప్పుడు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కవిత తన పార్టీకి సరికొత్త పేరును వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

You may also like
 ‘ఓటర్ల జాబితా సవరణపై రాజకీయం వద్దు’.. రాంచందర్ రావు ఫైర్!
trs
‘కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు: కవిత

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions