Komatireddy Venkat Reddy Meets Nitin Gadkari | గుజరాత్‌లోని ఎక్తానగర్ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) వద్ద జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘చింతన్ శివిర్-2026’ కార్యక్రమంలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించిన మంత్రి, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర సాయం అందించాలని కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపాదించిన అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అత్యంత సానుకూలంగా స్పందించారు.
సమావేశంలో ప్రతిపాదించిన కీలక ప్రాజెక్టులు ఇవే..
ఎల్బీనగర్ – హయత్‌నగర్ మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో లైన్‌తో సమన్వయం చేస్తూ 6 కి.మీ. మేర డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ను 2026–27 వార్షిక ప్రణాళికలో మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ – విజయవాడ NH-65ను 6+2 లేన్ల విస్తరణ పనులకు తుది ఆమోదం వేగవంతం చేయాలని, అలాగే శ్రీశైలం హైవే (NH-765) అటవీ ప్రాంతంలో నల్లమల పర్యావరణ పరిరక్షణ కోసం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
RRR ఉత్తర భాగం (161.518 కి.మీ) నిర్మాణానికి కేబినెట్, ఆర్థిక ఆమోదాలు త్వరగా ఇవ్వాలని, భూసేకరణ వ్యయంలో 50% రాష్ట్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామిక ప్రాంతాల అనుసంధానానికి దక్షిణ RRRను కూడా సమాంతరంగా చేపట్టాలని కోరారు. రూ.1,230 కోట్లతో యాదగిరిగుట్ట, నల్గొండ హనుమాన్ హిల్, నాగార్జునసాగర్–నాగార్జునకొండ, మంథని రామగిరి కోట, నిజామాబాద్ కిల్లా రామాలయంలలో రోప్‌వేల నిర్మాణానికి అనుమతులు కోరారు.
హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే..
రెండు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెంచే ఈ ఎక్స్‌ప్రెస్ వే DPR ప్రక్రియను వేగవంతం చేసి, తెలంగాణ డ్రైపోర్ట్ మరియు బందర్ పోర్ట్ కనెక్టివిటీకి అనుసంధానించాలని సూచించారు. CRIF కింద 511.68 కి.మీ. నిడివితో కూడిన 33 పనులకు రూ.1,227.75 కోట్లు, అలాగే కొత్తగూడెం బైపాస్, సుల్తానాబాద్, పగిడిపల్లి-నడికుడి ప్రాంతాల్లో 3 కీలక ROB/RUB ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు.







