Friday 3rd July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పాఠశాల సమీపంలో ఆ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం!

పాఠశాల సమీపంలో ఆ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం!

‌- మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Maharashtra Bans Sting Drink Near Schools | పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పరిసరాల్లో 500 మీటర్ల పరిధిలో ప్రసిద్ధ ‘స్టింగ్’ (Sting) ఎనర్జీ డ్రింక్, అలాగే ఇతర మత్తు పదార్థాల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఈ పానీయంలో ఉండే కొన్ని పదార్థాలు చిన్న పిల్లల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయనే ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ కఠిన నిబంధనను అమల్లోకి తెచ్చారు.

Read Also:  రామమందిరం విరాళాల చోరీపై ఆర్‌ఎస్‌ఎస్ తీవ్ర ఆగ్రహం!

శాసనసభలో ప్రకటన – మంత్రి నర్హరి జిర్వాల్ స్పష్టత..

రాష్ట్ర శాసనసభ (Assembly) లో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ పచ్‌పుటే అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆహార, ఔషధ పరిపాలన (FDA) శాఖ మంత్రి నర్హరి జిర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్ (Caffeine), చక్కెర (Sugar) అత్యధిక స్థాయిలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి పసిపిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

“పాఠశాల ప్రాంగణం మరియు దాని చుట్టుపక్కల ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ విక్రయాలపై గౌరవనీయ సభ్యులు లేవనెత్తిన ఆందోళనలు ముమ్మాటికీ సరైనవే.

పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో ఇటువంటి ఎనర్జీ డ్రింక్స్ లేదా ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు జరిగినట్లు తేలితే.. బాధ్యులైన దుకాణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి హెచ్చరించారు.

ఈ ఆంక్షను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని ఎఫ్‌డీఏ (FDA) విభాగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Read Also: రూ. 1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిపై బిస్కట్ దొంగతనం నింద!

18 ఏళ్ల లోపు పిల్లలకు అమ్మకాలపై నిషేధం?

ఎనర్జీ డ్రింక్స్ పిల్లలకు సులభంగా అందుబాటులో లేకుండా నిరోధించడానికి ప్రభుత్వం మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలని సభలో ఎమ్మెల్యేలు రాహుల్ కుల్, వరుణ్ సర్దేశాయ్ డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే, 18 ఏళ్ల లోపు మైనర్లకు ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను పూర్తిగా నిషేధించే నిబంధనను ప్రభుత్వం ప్రవేశపెడుతుందా? అని ఎమ్మెల్యే విక్రమ్ పచ్‌పుటే ప్రశ్నించారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్రతిపాదిత ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, ఈ పానీయాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేలా పాఠశాల స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను (Awareness Campaigns) నిర్వహించాల్సిందిగా విద్యా సంస్థలను కోరినట్లు వెల్లడించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions