- మీర్ పేట్ హత్య కేసు వివరాలు వెల్లడించిన సీపీ సుధీర్ బాబు
Meerpet Murder Case | తెలంగాణలో సంచలన సృష్టించిన హైదరాబాద్ లోని మీర్ పేట్ హత్య కేసు (Meerpet Murder Case) లో నిందితుడు గురుమూర్తిని పోలీసులు మంగళవారం మీడియా ముందుకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు (Rachakonda CP Sudheer Babu) కేసు గురించి వివరించారు. భార్య వెంకట మాధవిని అత్యంత క్రూరంగా హత్య చేసినా కూడా గురుమూర్తిలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు.
ఈ హత్య కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు విని తాము కూడా నివ్వెరపోయామన్నారు. ఒక మనిషి మీద పగపెంచుకొని ఇంత క్రూరంగా చంపుతారా? అని షాకైనట్లు తెలిపారు. హత్యపై ఆధారాలు సేకరించేందుకు తాము తీవ్రంగా శ్రమించినట్లు తెలిపారు.
‘గురుమూర్తి తన భార్య మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటర్ హీటర్ తో నీళ్లలో మరిగించాడు. ఉడికించిన ముక్కలను మళ్లీ స్టవ్పై మంటల్లో కాల్చాడు. కాల్చిన ముక్కలను పొడిగా మార్చాడు. బూడిదను పెయింట్ బకెట్లో తీసుకెళ్లి చెరువులో పోసి వచ్చాడు.
ఇంట్లో ఆనవాళ్లు లేకుండా చేసిన తర్వాత పిల్లలను తీసుకొచ్చాడు. అమ్మ ఏది అని పిల్లలు అడిగితే ఎక్కడికి వెళ్లిందో తెలియదని చెప్పాడు. హత్య చేసినట్లు భౌతిక ఆధారాలు లేకుంటే కేసు నుంచి తప్పించుకోవచ్చని గురుమూర్తి భావించాడు.
దీంతో ఎక్కడా ఆధారాలు దొరకకుండా ప్లాన్ చేశాడు. భార్యను చంపాలని నిర్ణయించుకున్న తర్వాతే పిల్లను బంధువుల ఇంటి వద్ద వదిలి వచ్చాడు. ఈనెల 16న భార్య తలను గోడకేసి కొట్టి.. గొంతుపిసికి చంపాడు ‘ అని రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు.