High Court On Theatres | సినిమా థియేటర్లకు (Cinema Theatres) సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షో, బెనిఫిట్ షోలకు అనుమతి అంశంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా రాత్రి పూట సినిమా షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8.40 గంటల లోపు, తెల్లవారుజామున 1.30 తర్వాత పిల్లలను సినిమాలకు అనుమతించరాదంటూ పేర్కొన్నారు.
వారి వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవద్దని ఆదేశించింది. అందరు స్టేక్ హోల్డర్లతో చర్చించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.