TVK MLAs To Resign | తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అత్యంత నాటకీయ నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించినప్పటికీ, తమను కాదని డీఎంకే (DMK) లేదా అన్నాడీఎంకే (AIADMK) ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే.. తమ పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని టీవీకే హెచ్చరించింది.
టీవీకే సాంకేతికంగా 107 స్థానాలు సాధించగా కాంగ్రెస్‌తో కలిపి బలం 112కి చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం 6 సీట్లు మాత్రమే దూరంలో ఉన్న విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడం మొదటి షాక్.
ఇదే తరుణంలో బద్ధశత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకేలు.. విజయ్ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఒక్కటవుతున్నారనే వార్తలు టీవీకే క్యాంపులో చిచ్చు రేపాయి.
అందుకే, “ప్రజా తీర్పును గౌరవించని చోట పదవులు ఎందుకు?” అనే నినాదంతో మళ్లీ ప్రజల వద్దకే వెళ్లాలని విజయ్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
ఒకేసారి 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అసాధారణం. రాజ్యాంగంలోని అధికరణ 190 ప్రకారం, రాజీనామాలు స్వచ్ఛందంగా ఇచ్చారా లేదా అని స్పీకర్ క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఇవి ఆమోదం పొందితే, అసెంబ్లీలో సగం నియోజకవర్గాలు ఖాళీ అవుతాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. ఆ 107 నియోజకవర్గాలకు ఆరు నెలల లోపు ఉపఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ఇది ఒక రకంగా రాష్ట్రంలో మినీ అసెంబ్లీ ఎన్నికగా మారుతుంది.
ఒకవేళ ఉపఎన్నికలు కూడా జరగని పరిస్థితి ఉంటే, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందనే కారణంతో గవర్నర్ ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా అధికారం మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతుంది.







