Friday 8th May 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో ఈ కులాల పేర్లు మార్పు!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో ఈ కులాల పేర్లు మార్పు!

tg cabinet meeting


Caste Names Changed In TG | తెలంగాణలోని వెనుకబడిన తరగతుల (బీసీ) దశాబ్దాల కల నెరవేరింది. బీసీ కులాల జాబితాలో పిలిచేందుకు అసభ్యకరంగా, కించపరిచే విధంగా ఉన్న పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర కేబినెట్ ఈ మార్పులకు ఆమోదముద్ర వేసింది. కొత్త పేర్లు తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమలులోకి రానున్నాయి. బీసీ గ్రూప్-ఏ (BC-A) విభాగంలో ‘దొమ్మర’ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించి, ఆ స్థానంలో ‘గడ వంశీయ’గా మార్చారు.

‘పిచ్చకుంట్ల’ అనే పేరును ‘వంశ రాజ్’గా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుడబుక్కల కులానికి ‘శివ క్షత్రియ’ అనే పదాన్ని పర్యాయపదంగా చేర్చారు. చాకలి లేదా రజక కులానికి సంబంధించి వన్నార్ అనే పదాన్ని తొలగించి ‘ధోబీ’గా మార్చారు.

వీరముష్టి, నెట్టి కోటల అనే వాటిని వీరభద్రియ కులానికి పర్యాయపదాలుగా వీటిని జోడించారు. బీసీ గ్రూప్-డి (BC-D) విభాగంలో వివాదాస్పదంగా ఉన్న ‘శూద్ర కులం’ అనే పదాన్ని రికార్డుల నుంచి పూర్తిగా తొలగించి, ‘తమ్మలి’గా పేరు మార్చారు.

మేర, చిప్పోలు కులాలకు ‘మేరు’ అనే పదాన్ని అదనంగా చేర్చారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు తమ కుల ధ్రువీకరణ పత్రాల్లో గౌరవప్రదమైన పేర్లను పొందే వీలుంటుందని బీసీ కమిషన్ భావిస్తోంది.

సమాజంలో ఆయా వర్గాల ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions